మోదీ గొప్ప నేత, ప్రపంచ సేవకుడు.. ప్రశంసలు కురిపించిన ట్రంప్
హ్యూస్టన్ వేదికగా నిర్వహించిన ‘హౌడీ మోదీ’కార్యక్రమంలో , అమెరికా అధ్యక్షుడు తొలిసారి ఓ మెగా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. హౌడీ మోదీతో భారత్-అమెరికాల సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ సభను ఉద్దేశించి మోదీ, ట్రంప్ చేసిన ప్రసంగాలకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. దాదాపు అరగంట పాటు సభను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. భారత్, అమెరికా స్వప్నాలను సాకారం చేసేందుకు మోదీతో కలిసి పనిచేస్తామని ఉద్ఘాటించారు. మోదీని గొప్ప నేతగా, ప్రపంచ సేవకుడిగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు.. భారత్‌తోపాటు ప్రపంచమంతటికీ మోదీ గొప్ప సేవ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతి, విలువలు తమతో కలిసిపోతాయని, ఇరుదేశాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. ప్రపంచానికి మనం మార్గనిర్దేశనం చేస్తున్నామని, అమెరికా సమాజంలో ఆర్థిక అసమానతలు వేగంగా తగ్గుతున్నాయని ట్రంప్ వివరించారు. గత నాలుగేళ్లలో 1.40 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించామని, పన్నుల హేతుబద్ధీకరణతో కొత్త కొలువులు సృష్టించామన్నారు. ఓహియోలో భారతీయ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌ను నిర్మిస్తోందని, గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో భారత్ పెట్టుబడులు పెడుతోందన్నారు. తమ దేశంలో తయారయ్యే అత్యుత్తమ వస్తువులు భారతీయులకు అందుబాటులో ఉంటాయని, భారత ఇంధన అవసరాలకు అమెరికా సహకారం అందజేస్తుందని ట్రంప్ హామీ ఇచ్చారు. టెక్సాస్ నుంచి అవసరమైన చమురు ఉత్పత్తులను భారత్‌కు తరలిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అటు రక్షణ రంగంలో సహకారం ఉంటుందని తెలిపారు. ఇరు దేశాలకు సరిహద్దు భద్రత అత్యంత ప్రాధాన్యత అంశమని, భారత్, అమెరికాలు రక్షణ ఉత్పత్తుల భాగస్వాములుగా మారుతున్నాయని ట్రంప్ వివరించారు. సరిహద్దు భద్రత విషయంలో భారత్‌కు పూర్తిగా సహకరిస్తామని, ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి అమాయక పౌరులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేలా త్వరలో పలు రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంటామని ట్రంప్ అన్నారు. తమ దేశాభివృద్ధికి భారత సంతతి అమెరికన్లు నిరంతరం కృషి చేస్తున్నారని, శాస్త్ర-సాంకేతిక, ఆర్థిక రంగాల్లో వారి కృషి మరువలేనిదన్నారు. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలను ఇరుదేశాలు కొత్త మార్గంలోకి నడిపిస్తున్నాయని, మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో 30 లక్షల మందికి పేదరికం నుంచి విముక్తి లభించిందన్నారు. రాజకీయ నాయకులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలకు తాను వ్యతిరేకమని వీటిని వలసదారులకు అందజేస్తామని అన్నారు. అక్రమ వలసదారుల కంటే ముందు అమెరికన్లు, భారతీయ-అమెరికన్లకు వీటిని అందజేస్తామన్నారు. భారత్ బలమైన ఆస్తి 40 కోట్ల మంది మధ్య తరగతి ప్రజలు.. ఈ సభకు 50 వేల మంది రావడం అత్యంత స్ఫూర్తిదాయకం... ఇది ఎంతో సంతోషకరమైన రోజు అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు.
By September 23, 2019 at 08:19AM
No comments