Breaking News

ఏపీ సచివాలయ పరీక్షలు.. పేపర్ ముందే లీక్..? చిక్కుల్లో జగన్ సర్కారు!


ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. 19.50 లక్షల మందికిపైగా పరీక్షలకు హాజరు కాగా.. 1.98 లక్షల మందికిపైగా అర్హత సాధించారు. పరీక్ష ముగిసిన 11 రోజుల్లోపే ఫలితాలు వెల్లడించామని.. మెరిట్ సాధించిన అభ్యర్థులకు శనివారం నుంచి కాల్ లెటర్లు పంపుతామని 27 నియామక ఉత్తర్వులు జారీ చేసి.. గాంధీ జయంతి రోజున సచివాలయాలను ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దాదాపు 20 లక్షల మంది రాత పరీక్షలకు హాజరైనా.. ఎక్కడా చిన్న పొరబాటు కూడా దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతోంది. కాగా శుక్రవారం ఉదయం ఏపీ ఎడిషన్ న్యూస్ పేపర్లను తిరగేస్తే.. సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పూర్తి విరుద్ధమైన వార్త కనిపించింది. ఫలితాల్లోనూ రికార్డ్ అంటూ.. సీఎం జగన్ సచివాలయ ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలను వెల్లడించిన వార్తను సాక్షి ప్రముఖంగా ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతిలో.. ‘‘పేపరు పట్టే.. ర్యాంకు కొట్టే’’ అంటూ సంచలనాత్మక కథనం టాప్ స్టోరీగా కనిపించింది. సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని ఆంధ్రజ్యోతి అనుమానాలు వ్యక్తం చేసింది. క్వశ్చన్ పేపర్ టైప్ చేసిన ఉద్యోగి పరీక్ష రాసి టాపర్‌గా నిలిచాడని, ఎగ్జామ్ టాపర్లలో ఏపీపీఎస్సీలో పని చేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వారి బంధువులు ఉన్నారని వివరాలతో సహా ఆంధ్రజ్యోతి పత్రిక కథనాలను ప్రచురించింది. ఏ కేటగిరిలో ఎవరు టాపర్‌గా లేదా టాప్-10లో నిలిచారు. వారు ఏపీపీఎస్సీలో ఏ జాబ్ చేస్తున్నారు. ఏపీపీఎస్సీలో పని చేసే ఉద్యోగుల బంధువులు ఎక్కడక్కడ టాపర్లుగా నిలిచారనే ఉదాహరణలతో ఆంధ్రజ్యోతి కథనం ఉండటం గమనార్హం. ఆంధ్రజ్యోతి ప్రభుత్వంపై దురుద్దేశంతో తప్పుడు కథనాన్ని ప్రచురించిందనేలా కాకుండా.. పేర్లతో సహా వివరాలను వెల్లడించడంతో.. పరీక్షలు రాసిన దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు అవాక్కయ్యారు. ఇంత తతంగం జరిగిందా? అనే అనుమానాలు వారిలో మొదలయ్యాయి. ఏపీపీఎస్సీలో పని చేసే వారికి, పేపర్ టైప్ చేసేవారికి ఎగ్జామ్ రాసే అవకాశం ఎందుకిచ్చారనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఏపీపీఎస్సీలో చంద్రబాబు మనుషులున్నారనే భావన ఉన్నప్పుడు.. ఏదో యూనివర్సిటీకి ఇచ్చి ఉండాల్సింది అనే వాదన వినిపిస్తోంది. 20 లక్షల మందికి పరీక్ష పెట్టి ఎలాంటి అవకతవకలు ఆస్కారం లేకుండా 11 రోజుల్లోనే ఫలితాలు వెల్లడించాం అని వైఎస్ జగన్ సర్కారు గొప్పగా చెప్పుకొంటున్న తరుణాన ఆంధ్రజ్యోతి కథనం పెద్ద బాంబే పేల్చింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.


By September 20, 2019 at 10:19AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/village-secretariat-results-did-appsc-employees-leaked-ap-grama-sachivalayam-exam-papers-to-relatives/articleshow/71212880.cms

No comments