Breaking News

పాపికొండలు యాత్ర: భద్రాచలం మీదుగా ఆపేయడంతో.. రాజమండ్రి వెళ్లి..


పాపికొండలు విహార యాత్రలో విషాదం చోటు చేసుకున్న ఘటనలో విస్మయకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. గోదావరి నదిలో 5 లక్షల క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం ఉన్నప్పటికీ.. పర్యాటకుల బోటుకు ఎలా అనుమతి ఇచ్చారనే ప్రశ్న తలెత్తుతోంది. పర్యాటక శాఖ అనుమతి లేకుండానే బోట్లను నడుపుతున్నారని సమాచారం. ఏపీతోపాటు తెలంగాణకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఈ ప్రమాదం బారినపడ్డారు. వాస్తవానికి హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు భద్రాచలం మీదుగా పాపికొండలు యాత్రకు వెళ్తారు. కానీ గోదావరికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. దాదాపు రెండు నెలలుగా భద్రాచలం మీదుగా పాపికొండలు యాత్ర ప్యాకేజీని నిలిపేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన వారు శని లేదా ఆదివారాల్లో వేకువజామునే భద్రాచలం చేరుకొని.. సీతారాముల దర్శనం చేసుకుంటారు. తర్వాత కూనవరం, వీఆర్‌పురం వెళ్లి.. అక్కడి నుంచి బోటులో పాపికొండలు విహారయాత్రకు వెళ్తుంటారు. వీఆర్‌పురం మీదుగా పాపికొండలకు వెళ్లేందుకు 20 లాంచీలు ఉన్నాయి. కానీ ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో గోదావరికి భారీగా వరదలు వస్తుండటంతో.. భద్రాచలం మీదుగా పాపికొండలు యాత్రకు అనుమతి ఇవ్వడం లేదు. ఆ‌ఫ్‌లైన్‌లోనూ టికెట్లు విక్రయించకుండా భద్రాద్రి జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారు. దీంతో తెలంగాణకు చెందిన వారు రాజమండ్రి మీదుగా పాపికొండలు విహార యాత్రకు వెళ్లి ప్రమాదం బారినపడ్డారు. తాజా ప్రమాదంతో భద్రాచలం మీదుగా ఇప్పట్లో పాపికొండలు యాత్రకు అనుమతులు వచ్చే అవకాశాలు లేవని భావిస్తున్నారు. Read Also:


By September 16, 2019 at 09:11AM


Read More https://telugu.samayam.com/telangana/news/godavari-boat-mishap-papikondalu-tour-package-canceled-from-bhadrachalam-side-so-telangana-tourists-went-to-rajahmundry/articleshow/71143690.cms

No comments