ఇది అసాధారణ వింత ప్రవర్తన.. రక్షణ మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెలంగాణ మంత్రి ఫిర్యాదు చేశారు. కంటోన్మెంట్ ఏరియాలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆర్మీ తీరు అసాధారణంగా, వింతంగా ఉందని ఆయన మండిపడ్డారు. సైన్యం రోడ్లను మూసేయడం వల్ల స్థానికులు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని రక్షణ మంత్రిని కేటీఆర్ కోరారు. ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు రక్షణ శాఖ దృష్టికి తీసుకొచ్చిందన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఏరియాలో వాహనాలు వెళ్లకుండా ఆర్మీ రోడ్లను మూసివేసింది. సోమవారం వరకు వాహనాల రాకపోకలు అనుమతి ఇచ్చిన మిలటరీ అధికారులు.. మంగళవారం సాయంత్రం నుంచి వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. బొల్లారంలోని కేంద్రీయ విద్యాలయం దగ్గర్లో పూరీ సింగ్ మార్గ్‌ను మూసివేసిన విషయాన్ని స్థానికులు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటల నుంచి ఆ మార్గంలో వాహనాలను వెళ్లనీయకుండా ఆర్మీ సిబ్బంది అడ్డుకున్నారని.. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన కథనాన్ని నెటిజన్లు ట్వీట్ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాము 8 కి.మీ. చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటి వరకూ ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులను చూపిస్తే వాహనాలు వెళ్లేందుకు అనుమతిచ్చే వారని.. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా రోడ్లను ఎందుకు మూసేశారో తెలీదని స్థానికులు వాపోతున్నారు. ఇలాంటి నిర్ణయాలను తీసుకునే ముందు మిలటరీ స్థానికులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. గత జూన్‌లో కొత్త గేటు ఏర్పాటు చేస్తున్నామనే కారణంతో ఆర్మీ రోడ్డును మూసేసింది. దీంతో మూడు రోజులపాటు స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.
By September 18, 2019 at 10:42AM
No comments