గోదావరి బోటు వెలికితీత.. చేతులెత్తేసిన నేవీ, రంగంలోకి ఆయన!
కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు బోల్తా పడిన ఘటనలో బుధవారం మరో 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 33 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిగతావారు బోటులో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. కాగా బోటును బయటకు తీసుకురావడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. గోదావరి అడుగున ఉన్న బోటును బయటకు తీయడం కోసం ఏపీ ఎస్డీఆర్ఎఫ్‌తోపాటు ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం, నౌకాదళం, ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ బృందం ప్రయత్నిస్తున్నాయి. నేవీ ఉన్నతాధికారి దశరథ్‌కు ఈ తరహా బోటు వెలికితీతల్లో ఎంతో అనుభవం ఉంది. దీంతో ఆయన రంగంలోకి దిగితే.. బోటును వెలికి తీయడం తేలిక అవుతుందని భావించారు. కానీ ఘటనా స్థలిని పరిశీలించిన ఆయన.. గోదావరి లోతు ఎక్కువగా ఉండటంతో.. బోటును వెలికి తీయలేమని చెప్పారు. 150 అడుగుల లోతు వరకే వెళ్లేందుకు తమకు అనుమతి ఉందని.. అంతకు మించి వెళ్లలేమని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. 2008లో బలిమెల రిజర్వాయర్లో భద్రతా సిబ్బంది బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 35 మంది గ్రేహౌండ్స్ కమాండోలు మరణించారు. అప్పట్లో సీలైన్ అనే సంస్థ ఈ బోటును వెలికి తీసింది. వారి సేవలు ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆ సంస్థ ప్రతినిధి రప్పించారు. కానీ వారు కూడా తమ వల్ల కాదన్నారు. వరద ప్రవాహం, లోతు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం సైడ్ సోనార్ టెక్నాలజీ ద్వారా నదిలో 300 అడుగుల లోతు వరకు బోటును గుర్తించే ప్రయత్నం చేసింది. కానీ ఇసుక మేటలు అడ్డంకిగా ఉండటంతో బోటు కచ్చితంగా ఎక్కడ మునిగిందనే గుర్తించడం కష్టంగా మారింది. స్టార్‌ఫిష్ పరికరాన్ని లోపలకు పంపినా.. ఇసుక మేటలే కనిపించాయి. సాంకేతికతో బోటును వెలికి తీయడం సాధ్యం కాదని తేలడంతో.. ఇక సంప్రదాయ పద్ధతిని అనుసరించాలని అధికారులు నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురానికి చెందిన మత్స్యకారుడు ధర్మాడి సత్యంను రంగంలోకి దింపాలని అధికారులు భావిస్తున్నారు. సముద్రం, నదుల్లో మునిగిపోయిన పడవలను వెలికి తీసిన అనుభవం ఆయన బృందానికి ఉంది. డైవర్లు నది లోపలికి వెళ్లి బోటును గుర్తించాక.. దానికి కొక్కేలు తలిగిస్తారు. పంటు, జేసీబీ, తాళ్ల సాయంతో దాన్ని పైకి లాగుతారు. అది కూడా కష్టమైన ప్రక్రియే కానీ.. ఆయన ప్రయత్నిస్తామంటున్నారు.
By September 18, 2019 at 11:34AM
No comments