Breaking News

జగన్ రిక్వెస్ట్‌ను కాదన్న అమిత్ షా.. కేసీఆర్ ఓకే చెప్పినా ఆయన తెలంగాణకే!


సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్ మీద ఏపీకి పంపడానికి కేంద్రం నిరాకరించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పని చేస్తున్న రవీంద్రను డిప్యూటేషన్ మీద ఏపీకి పంపాలని ఆంధ్రా సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ముందే జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరారు. దానికి ఆయన అంగీకరించారు. మే చివరి వారంలోనే కేసీఆర్ ఓకే చెప్పడంతోపాటు.. కేంద్రం ఆమోదం కోసం ఫైల్‌ను పంపారు. 15 రోజుల్లో హోంశాఖ నుంచి అనుమతి లభిస్తుందని భావించారు. కానీ ఇన్నాళ్లూ డిప్యూటేషన్ అంశాన్ని పెండింగ్‌లో పెట్టిన హోం శాఖ.. ఆయన్ను ఏపీకి పంపడానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. స్టీఫెన్ రవీంద్ర గతంలో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వద్ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు. వైఎస్ ఫ్యామిలీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన రాయలసీమలో చాలా కాలం పని చేశారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించగానే.. ఆయన్ను ఏపీకి పంపిస్తారనే ప్రచారం జరిగింది. ఏపీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా ఆయన్ను నియమించాలని జగన్ భావించారు. హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీగా ఉన్న స్టీఫెన్‌ను ఏపీకి పంపడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఓకే చెప్పగానే.. ఆయన సెలవులోకి వెళ్లారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఏపీలో అనధికారికంగా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర వ్యవహరిస్తున్నారనే వార్తలొచ్చాయి. కానీ స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్‌కు కేంద్రం మోకాలడ్డటంతో.. ఆయన తిరిగి తెలంగాణకు పరిమితమైనట్టే. వాస్తవానికి ఏపీ సీఎం జగన్‌కు కేంద్రంలో అధిక ప్రాధాన్యం లభిస్తోంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేబినెట్ మంత్రుల అపాయింట్‌మెంట్ జగన్‌కు వెంటనే దొరుకుతోంది. ప్రత్యేక హోదా మినహా జగన్ ఏం అడిగిన వెంటనే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్టుగా బీజేపీ పెద్దల వైఖరి ఉంది. కానీ ఓ అధికారిని డిప్యూటేషన్‌పై పంపాలన్న వినతిని మాత్రం కేంద్రం పట్టించుకోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.


By September 04, 2019 at 09:54AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/union-home-ministry-rejects-ips-officer-stephen-ravindra-deputation-request-sources/articleshow/70970831.cms

No comments