Breaking News

పసిపిల్లల ప్రాణాలతో ప్రయోగాలు.. నిలోఫర్‌లో గుట్టుగా క్లినికల్ ట్రయల్స్!


పసిపిల్లల ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లే డబ్బులకు ఆశపడి వారిపై క్లినికల్ ట్రయల్స్‌కు పాల్పడితే..? ప్రయోగ దశలో ఉన్న ఔషధాలు, వ్యాక్సిన్లను రహస్యంగా చిన్నారులపై పరీక్షిస్తే..? వాటి వల్ల తలెత్తే దుష్ప్రభావాలను తలుచుకుంటేనే భయమేస్తోంది కదూ. హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌లో జరుగుతున్నాయనే వార్త సంచలనమైంది. ఫార్మా కంపెనీలు కొత్తగా రూపొందించిన ఔషధాలు, వ్యాక్సిన్లను గుట్టు చప్పుడు కాకుండా పిల్లలపై ప్రయోగిస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియకుండా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. నీలోఫర్‌లోని కొందరు డాక్టర్లు ఇందుకు సహకరిస్తున్నారని, నిషేధిత డ్రగ్స్ కూడా క్లినికల్ ట్రయల్స్‌లో వాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నీలోఫర్‌‌లో క్లినికల్ ట్రయల్స్ విషయమై తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో.. ఈ ఘటనపై విచారణ జరపాలని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బయటకొచ్చింది ఇలా.. ఇద్దరు డాక్టర్లు గొడవ పడటంతో క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం బయటకు పొక్కింది. క్లినికల్‌ ట్రయల్స్‌ చేసినందుకు కొందరు డాక్టర్లకు ఫార్మా కంపెనీలు భారీ మొత్తం ముట్టజెప్పినట్టు సమాచారం. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ.. అధికారులెవరూ గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటివరకు 50 మంది పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగినట్టు తెలుస్తోంది. ఫార్మా కంపెనీలతో కలిసి పిడియాట్రిక్స్‌ విభాగంలో పనిచేసే ఓ ప్రొఫెసర్‌ అనధికారికంగా క్లినికల్ ట్రయల్స్‌ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. సదరు ప్రొఫెసర్ పిల్లలకు వ్యాక్సిన్లు ఇవ్వడంతోపాటు.. తల్లిదండ్రులకు తెలియకుండా వారి రక్త నమూనాలు సేకరించారని సమాచారం. క్లినికల్‌ ట్రయల్స్‌ తాను అన్ని అనుమతులు తీసుకున్నానని ఆ ప్రొఫెసర్ చెబుతుండటం గమనార్హం.


By September 27, 2019 at 11:12AM


Read More https://telugu.samayam.com/telangana/news/illegal-clinical-trials-held-in-niloufer-hospital-telangana-govt-orders-enquiry/articleshow/71323732.cms

No comments