రాజేంద్రనగర్‌లో భారీ పేలుడు.. తెగిపడిన వ్యక్తి చేతులు
నగరశివారు రాజేంద్రనగర్‌లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 173 వద్ద ఓ వ్యక్తి తన సంచిలో ఉన్న వస్తువులను బయటకు తీస్తున్న క్రమంలో ఓ బాక్స్‌ను ఓపెన్ చేయగా అది భారీ శబ్దం చేసుకుంటూ పేలిపోయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి రెండు చేతులు తెగిపడి 10 మీటర్ల దూరంలో పడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా బీతావాహంగా మారింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాక్స్‌ను ఓపెన్ చేసిన వ్యక్తి బిచ్చగాడి(40)గా గుర్తించారు. అతడు సమీప ప్రాంతాల్లో వస్తువులను ఏరుకుని వచ్చి అందులోని బాక్స్‌ను ఓపెన్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. డాగ్ స్వాడ్క్, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా బిచ్చగాడికి బాక్స్ ఇచ్చి ఓపెన్ చేసేలా చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కెమికల్ బాక్స్ అయి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పేలుడు సంభవించిన ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో ఇతరులెవరికీ ఎలాంటి హాని కలగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీ పేలుడు కారణంగా వచ్చిన శబ్ధంతో సమీప ప్రాంతాల్లో నివసించేవారు భయభ్రాంతులకు గురయ్యారు.
By September 08, 2019 at 11:56AM
No comments