తొలగిపోయిన పాక్ ముసుగు.. ముంబై దాడుల మాస్టర్ మైండ్‌కు సాయం చేయాలని ఐరాసకి లేఖ!
వేదికగా ముసుగు బయటపడింది. ప్రపంచ ఉగ్రవాదులకు స్వర్గధామమైన పాకిస్థాన్.. ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని అంతర్జాతీయ సమాజం చెవుల్లో పువ్వులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఓవైపు తాము ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తామని చెబుతూనే వారికి ఆర్థికంగా సాయం చేస్తోన్న దాయాది.. అసలు రూపం ఐరాసలో బయటపడింది. ఓ అంతర్జాతీయ ఉగ్రవాది కోసం ఏకంగా ఐరాస భద్రతామండలిని ఆశ్రయించడం గమనార్హం. ముంబై మారణహోమం సూత్రధాని హఫీజ్ సయీద్‌ను 2012లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా భద్రతామండలి ప్రకటించిన విషయం తెలిసిందే. హఫీజ్ సయూద్ వ్యక్తిగత ఖర్చుల కోసం అతడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించాలని పాకిస్థాన్ కోరింది. పాక్ అభ్యర్థనపై సభ్యదేశాలు నిర్ణీత గడువులోగా ఎలాంటి అభ్యంతరం తెలపకపోవడంతో సెక్యూరిటీ కౌన్సిల్ దీనిని ఆమోదించడం విశేషం. భద్రతామండలీ తీర్మానం మేరకు హఫీజ్ సయీద్ ఆర్థిక లావాదేవీలను రెండేళ్ల కిందట పాకిస్థాన్ స్తంభింపజేసింది. అతడి బ్యాంకు ఖాతాలను నిలిపివేయడంతో కనీస అవసరాలకు కూడా డబ్బుల్లేక తన కుటుంబం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని పాక్ ప్రభుత్వాన్ని హఫీజ్ ఆశ్రయించాడు. నెలవారీ ఖర్చుల కోసం తన ఖాతా నుంచి నగదు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న పాక్.. భద్రతామండలికి ఆగస్టు 15న లేఖ రాసింది. వ్యక్తిగత ఖర్చుల కోసం నెలకు రూ.1,50,000 (పాకిస్థానీ కరెన్సీ) విత్‌డ్రా చేసుకునేలా సయీద్‌కు అనుమతి ఇవ్వాలని అందులో కోరింది. హఫీజ్ మహ్మద్ సయీద్, హజీ మహ్మద్ అష్రఫ్, జఫర్ ఇక్బాల్ పేర్లను దీనిలో ప్రస్తావించింది. నిర్ణీత గడువులోగా దీనిపై సభ్యదేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో భద్రతామండలి అంగీకరించింది. లాహోర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 1974-99 అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా హఫీజ్ పనిచేశాడు. 25ఏళ్లు పాటు అధ్యాపకుడిగా సేవలందించడంతో అతడికి పెన్షన్ కూడా వస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో సయీద్‌తోపాటు జమాతే ఉద్దావాకు చెందిన కీలక నేతలను గత మే నెలలో పాకిస్థాన్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హఫీజ్ లాహోర్ జైల్లో ఉన్నాడు. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించేందుకు పాక్ కంటితుడుపు చర్యలు చేపడుతోంది. అయితే, సయీద్ కోసం ఐక్యరాజ్యసమితిని అభ్యర్థించడం వెనుక పాక్ వైఖరి స్పష్టంగా అవగతమవుతోంది. హఫీజ్ అరెస్ట్‌ను ఓ డ్రామాగా అభివర్ణించిన భారత్.. తీవ్రవాదానికి పాకిస్థాన్ నిలయంగా మారిపోయిందని మండిపడింది. అంతేకాదు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మినిస్టీరియల్ డిబేట్‌లో భారత్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, ఆర్థిక సాయం అందించే దేశాలను గుర్తించి, వాటికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అలసత్వం వహించకుండా ఉగ్రవాదంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ కోరారు.
By September 26, 2019 at 12:18PM
No comments