ఉన్నావో రేప్ కేసులో కీలక పరిణామం.. బాధితురాలి వద్దకే కోర్టు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచారం కేసులో బుధవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలి ముంగిటకే న్యాయం కదలివచ్చింది. ఆదేశాలతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఉన్నావో బాధితురాలి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నమోదుచేశారు. ఎయిమ్స్‌లోని జయప్రకాశ్ నారాయణ్ అపెక్స్ ట్రూమా విభాగం వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక న్యాయస్థానంలో ప్రత్యేక న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ విచారణ చేపట్టారు. నిందితులు ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్, శశిసింగ్‌లను కూడా హాజరుపరిచారు. తీహార్ జైలు నుంచి వారిని ఎయిమ్స్‌కు తరలించారు. సెప్టెంబరు 7న ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటిండెంట్ విన్నపం మేరకు ఆడియో, వీడియో రికార్డు చేయలేదు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసినా వాటిని ఆపేశారు. రాయబరేలి జైల్లో ఉన్న తన బంధువును కలవడానికి వెళ్లిన బాధితురాలు ప్రయాణిస్తోన్న కారు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో దీనిని హత్యాయత్నంగా భావిస్తున్నారు. ఇది జరగడానికి ముందే తనను నిందితుల బంధువులు బెదిరిస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు బాధిత యువతి లేఖ రాసింది. ఈ లేఖ రాసిన పది రోజుల తర్వాత ప్రమాదం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధిత యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2017 జూన్ 4న శశిసింగ్ అనే మహిళ ఉన్నావో ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ వద్దకు తీసుకెళ్లింది. సదరు మహిళ ఎమ్మెల్యేకు స్నేహితురాలు కాగా, తనపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు తెలిపింది. బాలికపై సెంగార్ అత్యాచారం చేసే సమయంలో ఆ గది బయట ఆమె ఉన్నట్లు విచారణలో వెల్లడించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఆ యువతి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయగా, పోలీస్ కస్టడీలో ఆయన చనిపోవడం యూపీలో చర్చనీయాంశమైంది. ఈ కేసులో సదరు ఎమ్మెల్యే, అతడి సోదరుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
By September 12, 2019 at 10:56AM
No comments