ఆ లైంగిక వేధింపుల వీడియోను దిలీప్‌కి ఇవ్వొద్దు: సుప్రీంను కోరిన నటి
2017లో ప్రముఖ మలయాళ నటుడు దిలీప్.. ఓ నటిని కిడ్నాప్ చేయించి లైంగికంగా వేధించిన ఘటన చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును పరిశీలిస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. బాధితురాలు సుప్రీం కోర్టును ఆశ్రయించి లైంగిక వేధింపులు జరిగిన సమయంలో తీసిన వీడియోను నిందితుడికి కానీ అతని సన్నిహితులకు కానీ ఇవ్వకూడదని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కేరళ ప్రభుత్వం కూడా బాధితురాలికి సానుకూలంగా స్పందించింది. ‘లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తీసిన వీడియోలు నిందితుడి చేతికి ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని అడ్డం పెట్టుకుని బాధితురాలిని బెదిరించేందుకు యత్నిస్తారు’ అని బాధితురాలి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. తాను ఏ నటినీ కిడ్నాప్ చేయించలేదని, అదే నిజమైతే వేధింపులకు పాల్పడిన సమయంలో రికార్డయిన విజువల్స్ ఏవన్నా ఉంటే తనకు ఇవ్వాలని దిలీప్ గతేడాది ఫిబ్రవరిలో కేరళలోని అంగమలై మెజిస్ట్రేట్ కోర్టును కోరారు. ఇందుకు ఆ కోర్టు ఒప్పుకోలేదు. దాంతో దిలీప్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దిలీప్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి కాస్త సమయం కావాలని కేరళ ప్రభుత్వం కోరడంతో ఈ ఏడాది మేలో సుప్రీం కోర్టు కేసుపై స్టే విధించింది. 2017 ఫిబ్రవరి 17న ప్రముఖ మలయాళ నటిని దిలీప్ తన స్నేహితుల చేత కిడ్నాప్ చేయించారు. కారులో ఆమెను లైంగికంగా వేధించారు. వాటిని రికార్డు కూడా చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దిలీప్ కాగా.. సునీల్ కుమార్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. యావత్ భారతదేశానికి చెందిన సినీ ప్రముఖులు బాధిత నటికి మద్దతుగా నిలిచారు. నిందితుడికి సరైన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. 2017 ఫిబ్రవరి 17న నటి షూటింగ్ నిమిత్తం కారులో బయలుదేరారు. షూటింగ్ పూర్తి చేసుకుని రాత్రి త్రిశ్శూర్ నుంచి కొచ్చికి వస్తుండగా కొందరు దుండగులు ఆమె కారును అడ్డగించి బలవంతంగా మరో కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. రెండు గంటల పాటు లైంగికంగా వేధించి వీడియోలు తీశారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలు నెట్‌లో పెడతామని చెప్పి బెదిరించారు. దాంతో సదరు నటి పోలీసులను ఆశ్రయించారు. తనకు నటుడు దిలీప్‌పై అనుమానంగా ఉందని బాధితురాలు తెలిపారు. దిలీప్ మొదటి భార్య మంజు వారియర్ బాధితురాలికి మంచి ఫ్రెండ్. అయితే దిలీప్, మంజు విడిపోయినప్పుడు బాధితురాలు మంజుకు అండగా నిలిచారు. ఆ తర్వాత దిలీప్ కావ్యను పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దిలీప్.. నటిపై పగ పెంచుకున్నారు. ఆమె కెరీర్‌ను ఎలాగైనా నాశనం చేయాలని చూశారు. ప్రస్తుతం దిలీప్ రిమాండ్‌లో ఉన్నారు. అయితే ఇంత జరిగినా అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.
By September 18, 2019 at 09:25AM
No comments