74 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన మహిళ.. తల్లీబిడ్డలు క్షేమం, ఇదో వరల్డ్ రికార్డ్
అమ్మ కావడం ఓ వరం. కొందరు దంపతులు మాత్రం పిల్లల కోసం చాలా ఏళ్లు నిరీక్షిస్తుంటారు. సంతానం కోసం డాక్టర్ల చుట్టూ, గుళ్ల చుట్టూ తిరుగుతారు. అలా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. సంతాన భాగ్యం కలగని దంపతులు ఎందరో. అమ్మ కావాలనే కోరిక బలీయంగా ఉన్న ఓ మహిళ పెళ్లయిన 57 ఏళ్లకు, 74 ఏళ్ల వయసులో తల్లయ్యింది. సంతాన సాఫల్య విధానంతో బామ్మ అని పిలిపించుకోవాల్సిన వయసులో మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు ఐవీఎప్ విధానంలో సంతాన భాగ్యం కలిగింది. వీరికి 1962లో పెళ్లయ్యింది. ఏళ్ల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా సంతానం కలగలేదు. వయసు మీదపడినా మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలని బలంగా ఉండేది. వారికి తెలిసిన ఓ మహిళ 55 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ విధానంలో తల్లి అయ్యారు. దీంతో మంగాయమ్మలో ఆశలు చిగురించాయి. గతేడాది నవంబర్‌లో గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ను సంప్రదించారు. ఐవీఎఫ్ నిపుణులైన డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మంగాయమ్మన పరీక్షించారు. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో.. ఐవీఎఫ్ విధానం చికిత్స ప్రారంభించారు. మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని, మరో మహిళ నుంచి అండాన్ని తీసుకొని ఐవీఎఫ్ విధానంలో పిండాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టారు. గర్భం దాల్చిన మంగాయమ్మను వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు. వయసు రీత్యా మంగాయమ్మకు సాధారణ ప్రసవం అయ్యే అవకాశం లేదు. దీంతో సెప్టెంబర్ 5న సీజేరియన్ చేశారు. మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చిందని, తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. Read Also: గతంలో రాజస్థాన్‌కు చెందిన దల్జీందర్, మొహిందర్ సింగ్ గిల్ దంపతులకు వృద్ధాప్యంలో సంతాన భాగ్యం కలిగింది. 2016లో ఐవీఎఫ్ విధానంలో వారికి పిల్లలు కలిగారు. అప్పటికి ఆమె వయసు 72 ఏళ్లు. ప్రస్తుతం మంగాయమ్మ 74 ఏళ్ల వయసులో తల్లి అయ్యారు. దీంతో ఇది ప్రపంచ రికార్డ్ అని డాకర్లు చెబుతున్నారు.
By September 05, 2019 at 11:16AM
No comments