Breaking News

స్కూల్‌కు రూ.618 కోట్ల కరెంటు బిల్లు.. షాక్ తిన్న నిర్వాహకులు!


సాధారణంగా ఓ స్కూల్‌కు కరెంటు బిల్లు మహా అయితే రూ. వేలల్లో ఉంటుంది. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ప్రయివేట్ స్కూల్‌కు రూ.618 కోట్ల బిల్లురావడంతో నిర్వాహకులు షాక్ తిన్నారు. వారణాసిలోని వినాయక్‌ కాలనీలో ఓ ప్రైవేటు పాఠశాలకు రూ. 618.5 కోట్లు బిల్లు పంపారు. అధికారుల నిర్వాకంతో మొత్తం కరెంటు బిల్లు అక్షరాలా రూ. 618,51,59,884 వచ్చింది. ఈ షాక్ నుంచి తేరుకున్న నిర్వాహకులు దీనిపై స్పష్టత కోసం పుర్వాంచల్‌ విద్యుత్‌ విత్రాన్‌ నిగమ్‌ డైరెక్టర్‌ను ఆశ్రయించారు. అయినప్పటికీ సదరు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో స్కూల్ యాజమాన్యం కరెంటు ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన జరగడం ఆసక్తికరం. సెప్టెంబరు 7లోగా బిల్లును చెల్లించాలని లేని పక్షంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో బిల్లు తామెలా చెల్లిస్తామని స్కూల్ మేనేజ్‌మెంట్ లబోదిబో మంటోంది. జనవరిలో కనౌజు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కరెంటు బిల్లు చూడగానే అతడికి గుండె ఆగినంత పనైంది. దీంతో ఆ వ్యక్తి బిల్లు పట్టుకుని విద్యుత్ కార్యాలయానికి పరుగులు పెట్టాడు. అబ్దుల్ బసిత్ అనే చిరు ఉద్యోగికి గత నెల మొత్తం178 యూనిట్ల విద్యుత్తు ఖర్చు చేయగా.. దానికి రూ.23,67,71,524 (రూ.23.67 కోట్లు) బిల్లు వచ్చింది. ఈ సందర్భంగా బసిత్ మాట్లాడుతూ.. ‘ఉత్తరప్రదేశ్‌ ప్రజలు చెల్లించాల్సిన మొత్తం బిల్లు నాకే వచ్చినట్లుంది. నా జీవితాంతం కష్టపడినా ఇంత మొత్తాన్ని చెల్లించలేను’ అని తెలిపాడు. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి విద్యుత్ ఛార్జీలను పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. పట్టణాలు, వాణిజ్యం, గ్రామీణ వినియోగదారులకు ఛార్జీల పెంపు వర్తిస్తుందని యూపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్పష్టం చేసింది. పట్టణాల్లోని నివాసాలకు 12 శాతం, పరిశ్రమలకు 10 శాతం పెంచుతున్నట్టు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఛార్జీలను రూ.400 నుంచి రూ.500కు పెంచుతున్నట్టు వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం 12.73 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచింది.


By September 06, 2019 at 12:18PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/school-has-got-an-electricity-bill-of-rs-618-5-crore-for-two-months-of-power-consumption-in-uttar-pradesh/articleshow/71005882.cms

No comments