Breaking News

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలుశిక్ష తప్పిస్తానని రూ.50వేలకు టోకరా.. లాయర్ అరెస్ట్


డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆ కేసు నుంచి తప్పించి జైలుశిక్ష పడకుండా చేస్తానని మోసం చేసిన ఓ లాయర్‌ను కేపీహెబ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్‌కు చెందిన ఆర్.వెంకట పవన్‌కుమార్ ఆగస్టు 16వ తేదీన మద్యం తాగుతూ కారు నడిపారు. అదే సమయంలో గచ్చిబౌలిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టిన పోలీసులకు ఆయన చిక్కాడు. దీంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకుని ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 19న కోర్టు పవన్‌కుమార్‌కి మూడు రోజుల జైలుశిక్ష విధించింది. అయితే జైలుకెళ్తే తన పరువు పోతుందని భావించిన ఆయన దాన్నుంచి తప్పించాలని కేపీహెబ్‌బీకి చెందిన లాయర్ భానుప్రసాద్‌ను ఆశ్రయించారు. జైలుశిక్ష తప్పించడంతో పాటు పోలీసులు సీజ్ చేసిన కారును కూడా విడిపిస్తానని చెప్పిన భానుప్రసాద్.. తనకు రూ.70వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతమొత్తం ఇచ్చుకోలేనని చెప్పిన పవన్‌కుమార్ రూ.50వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటనే అంత డబ్బు సమకూరకపోవడంతో తన యాపిల్ స్మార్ట్‌ వాచ్‌తో పాటు రూ.15వేల నగదు ఇచ్చాడు. అయితే భానుప్రసాద్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పవన్‌కుమార్ ఆగస్టు 29, 30, 31 తేదీల్లో జైలుశిక్ష అనుభవించాడు. తిరిగొచ్చిన పవన్‌కుమార్ తాను భానుప్రసాద్ చేతిలో మోసపోయానని తెలుసుకుని అతడిపై కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భానుప్రసాద్‌ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి కోర్టులు విధించే శిక్షలు అనుభవించాల్సిందేనని, ఎవరైనా వాటిని మాఫీ చేయిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


By September 10, 2019 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kphb-lawyer-arrested-for-cheating-software-engineer-in-hyderabad/articleshow/71058520.cms

No comments