Breaking News

వయసు 38.. 20వసారి బిడ్డకు జన్మనివ్వనున్న మహిళ, తొలిసారి హాస్పిటల్‌కు!


నాలుగు రోజుల కిందట 74 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ విధానంలో ఓ మహిళ కవలలకు జన్మనిచ్చి ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. తాజాగా, మరో మహిళ 20 వసారి బిడ్డకు జన్మనివ్వనుంది. మహారాష్ట్రలోని గిరిజన తెగకు చెందిన ఆ మహిళ వయసు 38 ఏళ్లు కాగా, ఇప్పటి వరకు 19సార్లు గర్భం దాల్చి, 16 మంది బిడ్డలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె 20వసారి గర్భం దాల్చింది. అంతేకాదు, అన్ని ప్రసవాలు ఇంట్లో జరగడం విశేషం. మజల్‌గావ్ పరిధిలోని కేశపురికి చెందిన సంచార గోపాల్ సామాజిక వర్గానికి చెందిన లంకాయబాయి ఖరత్ (38) 20వసారి గర్భవతి అయినట్టు గుర్తించిన స్థానిక వైద్యులు అవాక్కయ్యారు. దీంతో తొలిసారి ఆమెకు ఆస్పత్రిలో ప్రసవం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఏడో నెల గర్భవతి అయిన లంకాబాయికి గతంలో మూడుసార్లు గర్భస్రావమైంది. కాన్పుకు ఒక్కరు చొప్పున జన్మించగా, ఐదుగురు శిశువులు పుట్టిన కొద్ది రోజుల్లో చనిపోయారు. ప్రస్తుతం ఆమెకు 11 మంది పిల్లలని బీడ్ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ అశోక్ థోరట్ వెల్లడించారు. లంకాబాయి గురించి తెలియడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చి, అవసరమైన పరీక్షలను వైద్యులు నిర్వహించారు. ఇప్పటివరకు తల్లీ, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని, అవసరమైన మందులు ఇచ్చామని తెలిపారు. ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక హాస్పిటల్‌లో చేరాలని సూచించినట్టు వివరించారు. రోజువారీ పనులు, ఉపాధి కోసం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వలసవెళ్తుంటారు. మహిళ గర్భంలో పిండం పెరిగే అవయవమైన గర్భాశయం ఒక కండరం లాంటిది. కాన్పు జరిగిన ప్రతిసారీ అది సాగుతుందని వైద్యులు తెలిపారు. ఎక్కువసార్లు గర్భం దాల్చిన మహిళలో ప్లసెంటా వేరుపడిన తర్వాత గర్భాశయం సంకోచించడం కష్టమవుతుంది. వరస కాన్పుల వల్ల గర్భసంచి బలహీనపడటమే కాకుండా, తీవ్రస్థాయిలో రక్తంస్రావం ముప్పు పొంచి ఉంటుంది. గత ప్రసవాలకు సంబంధించి గర్భాశయంలో ఉండిపోయే స్కార్‌ కణజాలం ప్లసెంటాకు సమస్యల్ని సృష్టించడమే కాకుండా, నెలలు నిండకుండానే ప్రసవం కావడం లాంటి ముప్పులకు కూడా దారితీస్తుందని వైద్యులు వివరించారు.


By September 10, 2019 at 10:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/woman-from-maharashtra-has-become-pregnant-for-the-20th-time-now-she-is-healthy/articleshow/71059292.cms

No comments