Breaking News

2022 ఆగస్టు 15 నాటికి కొత్త పార్లమెంటు భవనం.. ప్రణాళికలు సిద్ధం!


దేశ రాజధాని ఢిల్లీకి తలమానికంగా ఉన్న రాష్ట్రపతి భవన్-ఇండియా గేట్‌ను అనుసంధానం చేస్తూ నాలుగు కిలోమీటర్ల మేర విస్తీరించి ఉన్న సెంట్రల్ విస్థాను ఆధునిక హంగులతో పునర్నిర్మించనున్నారు. వీటికి సంబంధించిన కన్సెల్టీన్సీ పనుల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత సంస్థల నుంచి ప్రణాళికల కోసం కేంద్ర ప్రజా పనుల విభాగం బిడ్డింగ్‌లను ఆహ్వానించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించనున్నారు. కొత్త భవనం లేదా ప్రస్తుత బిల్డింగ్ ఆధునికీకరణ అని బిడ్డింగ్‌లో పేర్కొన్నా తొలి ప్రతిపాదనకే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఉమ్మడి సెక్రటేరియట్‌ను నిర్మించి అన్ని విభాగాలను ఇందులోకి తరలించి సెంట్రల్ విస్థాను ఆధునీకరించి, పర్యటకాన్ని మరింత ఆకర్షించేలా చర్యలు తీసుకోనున్నారు. ఆధునికీకరణ కోసం మాస్టర్ ప్రణాళికను రూపొందించాలని, ఇది నవభారత విలువలు, ఆకాంక్షలను ప్రతిబింబించేవిగా ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. సుపరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనం, పాలనాదక్షత, భారతీయ సంస్కృతి, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని తెలిపింది. ప్రజా సౌకర్యాలు, పార్కింగ్, సుందరీకరణ, పర్యవరణహితంగా ఉండేలా చూడాలని సూచించింది. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత సభ్యుల సంఖ్య పెరుగుతారని, వారికి అనుగుణంగా ప్రస్తుత భవనంలో సౌకర్యాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టును 2024లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, రాజ్‌పథ్ ఆవరణలో గత శతాబ్ద కాలంలో తలపెట్టిన అతి భారీ నిర్మాణ ప్రక్రియ ఇది. ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటిన్స్ ప్లాన్ ప్రకారం , పార్లమెంట్ హౌస్, నార్త్, సౌత్ బ్లాక్‌లను 1911 నుంచి 1931 మధ్య నిర్మించారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయితే నార్త్, సౌత్ బ్లాక్‌ల నుంచి ఆయా విభాగాలను తరలించి, దానిని మ్యూజియంగా మారుస్తారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సెంట్రల్ విస్థా, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహిస్తోంది. బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థల ప్రణాళికలను పరిశీలించి, ప్రభుత్వం పేర్కొన్న అంశాలతో సరిపోయేదానిని ఎంపిక చేస్తారు. అనంతరం నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. సీపీడబ్యూడీ ప్రకారం.. కొత్తగా నిర్మించబోయే భవనాలు కనీసం 150 నుంచి 200 ఏళ్లు మనుగడలో ఉండేలా రూపుదిద్దుకోనున్నాయి. కాగా, 2022 ఆగస్టు 15 నాటికి ప్రస్తుత పార్లమెంటు భవనం రీమోడలింగ్ లేదా కొత్త భవనం సిద్ధమవుతాయి. ఆ ఏడాది వర్షకాల సమావేశాలు అందులోనే నిర్వహించనున్నారు. పార్లమెంటులో ఎంపీలకు చాంబర్లు, కార్యాలయాలకు స్థలం కొరత తీవ్రంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అందుకే ప్రస్తుత భవనానికి మార్పులు చేర్పులు చేయడం లేదా కొత్తది నిర్మించడం ఎంతో అవసరమని అంటున్నారు.


By September 13, 2019 at 11:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/modi-government-to-re-plan-and-redevelopment-of-rajpath-parliament-and-secretariat/articleshow/71107232.cms

No comments