మీరు చేసిన సినిమాలు నా లైఫ్‌టైమ్‌లో చేయలేను: విజయ్ దేవరకొండ
ఐశ్వర్య రాజేష్, నటకిరీటి రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి.’ తమిళ హీరో శివ కార్తికేయన్ ప్రత్యేక పాత్రలో నటించారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్స్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ రాశీఖన్నా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇది క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన మూవీ కావడంతో అభిమానుల కోసం విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్‌లు వేదిక మీద క్రికెట్ ఆడడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘పెళ్లి చూపులు సినిమా నచ్చి మనం కలిసి ఒక సినిమా చేద్దాం అని కె.ఎస్.రామారావు గారు, క్రాంతి మాధవ్ నన్ను కలిశారు. ఆ సినిమా షూట్ నుండే ఇక్కడికి వచ్చాను. ఆ సినిమాలో ఒక ముఖ్యపాత్రలో ఐశ్వర్య కూడా నటిస్తోంది. ఐశ్వర్య రాజేష్ నటించిన చాలా సినిమాలు నేను చూశాను. తను మంచి పెర్ఫార్మర్. త్వరలో తనతో కలిసి నటించబోతున్నందుకు చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది’’ అని చెప్పారు. నిర్మాత కె.ఎస్.రామారావును తామంతా సెట్‌లో ‘పప్పా’ (డాడీ) అని పిలుస్తామని విజయ్ వెల్లడించారు. తామందరికీ ఒక తండ్రిలా ఏది కావాలన్నా ఇవ్వడమే ఆయన పని అని చెప్పారు. ‘‘ఆయన ప్రతిరోజూ సెట్‌లో ఉంటారు. మీరు రిలాక్స్ అవ్వండి.. మేం చూసుకుంటాం అంటే.. నాకు నచ్చింది, వచ్చింది సినిమా.. ఇదే నా లైఫ్. ఇది చేయకపోతే ఇంకేం చేస్తాం అంటారు. ఇన్ని సినిమాలు చేసినా ఆయన ఇప్పటికీ సినిమాలను ప్రేమిస్తారు. ’’ అన్నారు. ఇక నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతూ.. ‘‘రాజేంద్రప్రసాద్ సార్.. మీరు ఈ లైఫ్‌లో చేసినన్ని సినిమాలు నా లైఫ్‌టైమ్‌లో చేయలేనేమో!! మీరు చేసిన సినిమాలు, పాత్రలు, అనుభూతులు ఇప్పుడు మా వల్ల కాని పని. మీలాంటి వారే మాకు స్ఫూర్తి’’ అని అన్నారు. ఇక సినిమాకు సంబంధం లేకుండా మనుషులకు పనికొచ్చే కొన్ని విషయాల గురించి విజయ్ మాట్లాడారు. నీటిని వృథా చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. ‘‘2022కి తాగునీటికి ఇబ్బందులు తప్పవని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నీటి లీకేజీలను అరికడదాం. ఒక రోజు నీళ్లు లేకుంటే పరిస్థితి ఏంటో ఆలోచించండి. పెట్రోల్‌లా నీళ్లు కూడా లిమిటెడ్‌గా ఉన్నాయి.. పొదుపుగా వాడండి’’ అని సూచించారు. కాగా, ఈ చిత్రంలో ఝాన్సీ, సి.వి.ఎల్.నరసింహారావు, వెన్నెల కిశోర్, ‘రంగస్థలం’ మహేశ్, విష్ణు(టాక్సీవాలా ఫేమ్), రవిప్రకాశ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఐ.ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. దిబు నినన్ సంగీతం సమకూర్చారు. హనుమాన్ చౌదరి మాటలు రాశారు. పాటలకు రామజోగయ్యశాస్త్రి, కృష్ణ కాంత్ (కెకె), కాసర్ల శ్యామ్, రాంబాబు గోసల సాహిత్యా్న్ని అందించారు.
By August 21, 2019 at 10:55AM
No comments