Breaking News

వీడిన ఖైరతాబాద్ మర్డర్ మిస్టరీ.. తిట్టాడన్న కక్షతోనే హత్య


హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ మెట్రో పిల్లర్ దగ్గర ఈ నెల 17న జరిగిన హత్యకేసును పోలీసులు చేధించారు. తనను తిట్టాడన్న కోపంతో ఓ యువకుడు ఈ హత్య చేసినట్లు గుర్తించారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించి రెండ్రోజుల్లోనే పట్టుకున్నారు. నిందితుడిని సైఫాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ చింతల సైదిరెడ్డి, డీఐ నర్సింహులుతో కలిసి ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. Also Read: నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం జీనుగుపల్లి గ్రామానికి చెందిన నేనావత్‌ బంగారి (56) ఖైరతాబాద్‌లోని మహాభారత్‌ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. 17వ తేదీన పొదిళ్ల ప్రకాష్‌రాజ్‌ అలియాస్‌ డాలర్‌ పింటు(19) అనే యువకుడు పటేల్‌ బిల్డింగ్‌ వీధిలో సిగరెట్ తాగుతుండగా బంగారి అతడిని ఢీకొట్టాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో బంగారి అతడిని తిట్టాడు. అదే రోజు బంగారి భార్యతో గొడవపడి ఇంటి నుంచి వచ్చి మెట్రో డివైడర్‌పై పడుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రకాశ్‌రాజ్‌ మద్యం మత్తులో కత్తి తీసుకుని అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బంగారి వద్దకు వెళ్లాడు. సమీపంలోని కాంక్రీట్ పిల్లర్‌ను ఎత్తుకెళ్లి బంగారి తలపై వేశాడు. అనంతరం కత్తి తీసుకుని అతడి ఛాతీ, కడుపు భాగంలో విచక్షణా రహితంగా పొడిచాడు. Also Read: స్థానికుల సమాచారం తెల్లవారుజామున అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సెంట్రల్‌ జోన్‌ అదనపు డీసీపీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. సమీపంలోని సీసీ కెమెరాల్లో హత్య తాలూకు దృశ్యాలు రికార్డ్ కావడంతో నిందితుడి కోసం ఆరా తీశారు. అతడి ఫోటోలతో విచారించగా ప్రకాశ్‌రాజ్ అలియాస్ పింటుగా స్థానిక యువకులు గుర్తించారు. దీంతో అతడి కోసం గాలించి బోరబండలోని బంధువుల నివాసంలో అరెస్ట్ చేశారు. కేవలం తిట్టాడన్న కోపంతోనే వ్యక్తిని హత్య చేయడంతో నిందితుడి మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు.


By August 21, 2019 at 10:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/accused-arrested-in-khairatabad-murder-case/articleshow/70765063.cms

No comments