Breaking News

‘సైరా’ టీజర్: మెగా ఫ్యాన్స్.. కాస్త ఆగండి!


తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు, రాయలసీమ పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కడప కేంద్రంగా బ్రిటిషర్లపై పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ భారీ బడ్జెత్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన 151వ సినిమాగా ఓ చారిత్రాత్మక కథను ఎంపిక చేసుకోవడంతో ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై పడింది. ఫస్ట్‌లుక్ విడుదలైన తరవాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికితోడు తన తండ్రి హీరోగా రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తుండటంతో మెగా అభిమానులు ఈ సినిమాపై కోటి ఆశలు పెట్టుకున్నారు. సినిమా అప్‌డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సైరా’ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చూసిన తరవాత ‘సైరా’పై ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆగస్టు 20న టీజర్ విడుదల చేస్తున్నట్లు మేకింగ్ వీడియోలో ప్రకటించారు. ఆగస్టు 20 వచ్చేసింది. మెగా అభిమానులు టీజర్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉదయం నుంచి రామ్ చరణ్ ఫేస్‌బుక్ పేజ్‌లోకి వెళ్లి వెతుకుతున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్ పేజ్ చూస్తున్నారు. ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటూ ఆత్రుతగా వేచి చూస్తు్న్నారు. మొత్తానికి ఒక ప్రకటన వచ్చింది. ‘సైరా’ టీజర్‌ను మధ్యాహ్నం 2.40 గంటలకు విడుదల చేస్తున్నట్లు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. చిరంజీవి షార్ప్ లుక్‌తో కూడిన పోస్టర్‌ను కూడా వదిలింది. ఈ ట్వీట్‌తో మెగా అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. ఇక టీజర్ విడుదలైన తరవాత యూట్యూబ్ బద్దలైపోవడం, ట్విట్టర్ చిరిగిపోవడం ఖాయం.


By August 20, 2019 at 11:56AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevis-epic-historic-drama-sye-raa-narasimha-reddy-teaser-will-be-unveiled-today/articleshow/70749832.cms

No comments