Breaking News

అందుకే బలగాల మోహరింపు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వివరణ


అత్యవసరంగా అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసిన కేంద్రం, అదనపు బలగాలను తరలించడంతో జమ్మూకశ్మీర్‌‌లో ఏం జరగబోతుంది అనే సందేహాం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. అమర్‌నాథ్ యాత్ర చరిత్రలోనే ఇలా అర్ధాంతరంగా నిలిపివేయడం ఇదే తొలిసారి. అంతేకాదు, నిట్ శ్రీనగర్ క్యాంపస్‌ను కూడా తక్షణమే మూసివేయాలని ఆదేశించడంతో కశ్మీర్‌లో ఏదో జరగబోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అదనపు బలగాల మోహరింపుపై జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు శుక్రవారం కలిసి, వివరణ కోరాయి. కేంద్రం చర్యలతో ప్రజల్లో భయాందోళనలు నెలకున్నాయని, వాటిని తొలగించాలని ఆయనకు విజ్ఞప్తి చేశాయి. కాగా, కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు, సౌలభ్యాలను కల్పిస్తోన్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను రద్దుచేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే, రాజ్యాంగ సవరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పష్టం చేశారు. కానీ, కేంద్రం చర్యలు మాత్రం ఆ దిశగానే సాగుతోన్నట్టు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఢిల్లీలో మాట్లాడుతూ.. ఉగ్రముప్పు పొంచి ఉందన్న ఐబీ హెచ్చిరికలతోనే అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్టు తెలిపారు. తాజా పరిస్థితిపై ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐబీ సూచన మేరకే జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లోని తెలుగు ప్రజలు సహా మరెవరి భద్రతకు ఢోకాలేదని అన్నారు. శనివారం రాత్రి జమ్మూ నుంచి 20 మంది ఎన్‌ఐటీ తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారని, వారు ఆదివారం మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరుకుంటారని ఆయన తెలియజేశారు. మిగతా 90 మంది ఆదివారం ఉదయం ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలు దేరినట్టు వెల్లడించారు. జమ్మూ నుంచి విద్యార్థులు, పర్యాటకులను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాటు చేశామని, కేంద్ర హోం శాఖ, స్థానిక ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాలను పర్యవేక్షిస్తోందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. బలగాల తరలింపుపై కేంద్ర హోం శాఖకు చెందిన అధికారులు స్పందించారు. పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ అధికారి మాట్లాడుతూ.. వారం రోజుల కిందట 100 కంపెనీ బలగాలు అంటే 10,000 మంది సైనికులను కశ్మీర్‌కు తరలించినట్టు తెలిపారు. అంతర్గత భద్రత కోసమే వీరిని తరలించామని, అదనంగా మరికొన్నింటిని తరలించనున్నట్టు వివరించారు. అయితే, బలగాల మోహరింపుపై బహిరంగంగా ప్రకటించడం కుదరదని అన్నారు.


By August 04, 2019 at 11:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/minstry-of-home-affairs-minister-kishan-reddy-responded-about-deployment-security-in-jammu-and-kashmir/articleshow/70519503.cms

No comments