హీరోయిన్స్ ఆ పని చెయ్యకతప్పదా..?
కథానాయిక.. సినిమాల్లో ఈ పదానికి చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. కానీ, ఇది ఒక్కప్పటి మాట. ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు పరిమితం అవుతున్నారు అనేది నిజం. నటించే సత్తా ఉన్నా సరయిన అవకాశం రాక వచ్చిన గ్లామర్ పాత్రలు చేసే వాళ్ళు కొందరయితే, సినిమాల్లో ఉండాలి అనుకుని ఫిక్స్ అయ్యి నటన సరిగా రాక వచ్చిన పాత్రలే చేసుకుని పోయేవాళ్లు మరికొందరు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించే కొద్ది మంది హీరోయిన్లలో సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి వాళ్ళను ఉదాహరణలుగా చూపించవచ్చు. కానీ వీళ్ళలో ఎక్కువమంది కెరీర్ చరమాంకంలో ఉన్నారు. పైగా వాళ్ళు తమ పెర్సనల్ లైఫ్‌ని కూడా బాలన్స్ చేసుకోవడానికి వచ్చిన సినిమాల్లో నుండి తమకి నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచుకుని చేస్తున్నారు. అందరికి ఆ అవకాశం ఉండదు. పూజా హెగ్డే ముందు ‘ముకుంద’, ‘ఓ లైలా కోసం’ సినిమాల్లో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే చేసింది. కానీ ఆమెకి అప్పుడు గుర్తింపు రాలేదు, అవకాశాలు రాలేదు. కానీ ‘DJ’ సినిమాలో బికినీ వేసి మరీ మొహమాటపడకుండా అందాల ప్రదర్శన చెయ్యడంతో ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా అగ్రహీరోల సరసన వరుసగా నటించింది. ఇక ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న రష్మిక కూడా ముందు ‘ఛలో’ సినిమాలో డీసెంట్‌గా కనిపించింది. కానీ, అప్పుడు ఆమె ఎవ్వరికీ పెద్దగా నచ్చలేదు. ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండతో రెండు ఘాటు లిప్ లాక్స్ చేసేసరికి మాత్రం అంతా ఆమెపై ఫోకస్ చేసారు. ఇప్పడు బన్నీ, మహేష్ సినిమాల్లో ఆమె హీరోయిన్. చివరికి ‘బాహుబలి’లో తమన్నా, ‘సాహో’లో శ్రద్ధా కపూర్.. సినిమా ఏదయినా, హీరోయిన్ ఎవరయినా కూడా అందాల విందు చేస్తేనే ఆఫర్లు వెల్లువెత్తుతాయి. ‘RX 100’ సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆ సినిమాలో పాయల్ రాజపుత్ హీరోతో కలిసి పండించిన రొమాన్స్ అనేది ఒప్పుకుని తీరాలి. అయితే ఆ సినిమా తరువాత ఆమెకు మళ్ళీ అదే తరహా సినిమాలు, అదే తరహా రోల్స్ వచ్చాయి. చాలా కాలం వాటికి వద్దనుకుంటూ వచ్చిన ఆమె మళ్ళీ అదే తరహా రోల్ చెయ్యకతప్పలేదు. ‘RX 100’లోనే ఆమె ఎక్స్‌పోజింగ్ హద్దులు దాటింది అనుకుంటే.. ఇప్పడు చేస్తున్న ‘RDX లవ్’ అయితే బూతుకు మారుపేరులా ఉంది. బోల్డ్ అనేపదానికి ఎక్స్‌టెన్షన్ ఇచ్చి మరీ హీరోయిన్స్‌తో యథేచ్ఛగా బూతులు మాట్లాడించే కల్చర్ కూడా ఎక్కువైపోతోంది. కేవలం పాయల్ మాత్రమే కాదు రకుల్ ప్రీత్ సింగ్ ‘మన్మథుడు-2’లో చేసిన యాక్ట్స్ చూసాక చాలామందికి నోటమాట రాలేదు. మెహ్రీన్ కూడా నటన కంటే ఎక్కువగా స్కిన్ షోని నమ్ముకునే బండి నడిపిస్తుంది. స్కిన్ షోని నమ్ముకుని ముందుకు వెళ్లిన హెబ్బా పటేల్, రాశీ ఖన్నా, రెజీనా లాంటి వాళ్లకు సినిమాలు వచ్చాయి. కానీ కెరీర్ గ్రాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఇక కెరీర్ ఎండ్‌కి వచ్చింది అని గుర్తించిన కాజల్ కూడా ఈ మధ్య ఎలాంటి సీన్స్ చెయ్యడానికి అయినా అభ్యంతరం చెప్పడం లేదు. ఆమె నటించిన ‘క్వీన్’ తమిళ్ రీమేక్ ‘పారిస్ పారిస్’లో సీన్స్ అయితే సెన్సార్ కత్తెరకి బలైపోయాయి. కానీ, అవి కట్ చేసినందుకు కాజల్ ఫీల్ అవ్వడం అసలు హైలైట్. ‘మహానటి’, ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’, ‘కర్తవ్యం’ లాంటి సినిమాలు వేళ్ళమీద లెక్కేయ్యవచ్చు. కానీ హీరోయిన్స్ అందాలని, వాళ్ళ బోల్డ్ సీన్స్‌ని నమ్ముకుని తెరకెక్కే సినిమాలు మాత్రం బోలెడన్ని వచ్చాయి, వస్తున్నాయి. హీరోయిన్ అంటే ఎక్స్‌పోజింగ్ చెయ్యాలి అనేది తప్పనిసరిగా మారింది. ఈ ట్రెండ్‌కి ఇప్పట్లో బ్రేక్స్ పడే అవకాశం అయితే లేదు.
By August 31, 2019 at 12:23PM
No comments