ప్రాంతాలకు అతీతంగా సుష్మాకు అభిమానగణం.. తమ ప్రధాని అయితే బాగుండేదన్న పాక్ మహిళ!
సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తన అనర్గల ప్రసంగాలతో, సంప్రదాయమైన కట్టుబొట్టుతో భారత రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు సుష్మా. ఇందిర తర్వాత విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనతకెక్కిన చిన్నమ్మ.. ఆ పదవికే వన్నె తెచ్చారు. కేవలంలో భారతీయులే కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ వాసులు సైతం ఆమె అభిమానగణంలో ఉన్నారు. భారత్‌కు అత్యవసర వైద్యం కోసం వచ్చే పాకిస్థానీలకు ఆమె చేసిన సాయం వారు జీవితాంతం మరిచిపోలేరు. సుష్మా చేసిన సాయానికి పాక్‌వాసులకు ఆమె పట్ల ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. దీనికి రెండేళ్ల కిందట ఓ మహిళ చేసిన ట్వీటే నిదర్శనం. మీరు మా దేశానికి ప్రధానమంత్రి అయి ఉంటే దేశం ఎంతో బాగుపడేదంటూ కరాచికి చెందిన ఒక మహిళ సుష్మా స్వరాజ్‌కు ట్విట్టర్‌లో రాశారంటే ఆమెపై వారు ఎంత గౌరవం పెంచుకున్నారో ఇట్టే అర్థమవుతుంది. భారత్‌లో చికిత్స పొందడానికి వీలుగా తనకు భారత వీసా ఇప్పించాల్సిందిగా హిజాబ్ ఆసిఫ్ అనే మహిళ సుష్మా స్వరాజ్‌ను ట్విట్టర్‌లో కోరారు. ఈ ట్వీట్‌కు తక్షణమే స్పందించిన సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆసిఫ్ వినతిని పరిగణనలోకి తీసుకుని, వీసా ఏర్పాట్లు చేయాలని పాక్‌లోని భారత హై కమిషనర్ గౌతమ్ బంబావాలేను సుష్మా స్వరాజ్ ఆదేశించారు. తన విజ్ఞప్తికి సుష్మా వెంటనే స్పందించిడంతో ఆసిఫ్ పొగడ్తలతో ముంచెత్తారు. షబాహత్ అబ్బాస్ తఖ్వి అనే ఒక రోగి కోసం ఆసిఫ్ వీసా కోసం ప్రయత్నిస్తున్నారు.. తాము భారత్‌ను ద్వేషించడం లేదని, భారతదేశాన్ని, భారతీయులను తాము ప్రేమిస్తున్నామని ఆమె ట్వీట్‌లోపేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని అనేక మందికి భారత్‌పట్ల ప్రేమాభిమానాలున్నాయని ఆమె తెలిపారు. ఈ ట్వీట్‌పై సుష్మా సమాధానం ఇస్తూ.. అత్యవసర కేసుల్లో కూడా పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ స్పందించడం లేదని, భారత్ వీసాకోసం సిఫార్సు లేఖ ఇవ్వడానికి నిరాకరించడం శోచనీయమని సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. దానికి సర్తాజ్ అజీజ్ ఎవరో, ఉన్నారో లేదో కూడా ఇక్కడ ఎవరికీ తెలియదని ఆ మహిళ సమాధానం ఇచ్చారు. సుష్మా ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న భారత అధికారులు వీసా మంజూరుచేశారు. దీంతో పాక్ మహిళ సుష్మాను పొగడ్తలతో ముంచెత్తారు. ‘సుష్మా స్వరాజ్ ఓ సూపర్ ఉమెన్? దేవత? ఆమెను వర్ణించడానికి మాటలు చాలడం లేదు.. ఐ లవ్ యూ మేడమ్.. కన్నీటితో మిమ్మల్ని అభిమానించకుండా ఉండలేకపోతున్నా.. నా గుండె మీ పేరునే కొట్టకుంటోంది.. పాకిస్థాన్‌కు అదృష్టం లేదు’ అని ట్వీటర్ చేశారు. ‘ఇక్కడ బోలెడంత మందికి మీపై ప్రేమ, గౌరవం ఉన్నాయి. మీరు మా ప్రధానమంత్రి అయితే, దేశం బాగుపడేది’ అంటూ ఆ మహిళ ట్వీట్ చేయడం విశేషం.
By August 07, 2019 at 09:13AM
No comments