Breaking News

‘సైరా’కు మోహన్‌లాల్ గాత్రదానం!


మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు, రాయలసీమ పోరాట యోధుడు ఉయ్యాలడవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై ఇటు మెగా అభిమానులతో పాటు అటు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను రెట్టింపు చేయడానికి ఈనెల 20న చిత్ర టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ‘సైరా’ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. టీజర్‌ను కూడా ఈ నాలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే తెలుగు టీజర్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు. చిరంజీవి పక్కన నిలబడగా పవన్ వాయిస్ ఓవర్ చెప్పుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. పవన్ వాయిస్ ఓవర్ చెప్పారనడంతో టీజర్‌పై మెగా అభిమానుల ఆసక్తి మరింత పెరిగిపోయింది. అయితే, వాళ్లను ఆనందానికి గురిచేసే మరోవార్త ఇప్పుడు బయటికి వచ్చింది. ‘సైరా’ మలయాళ టీజర్‌కు మాలీవుడ్ సూపర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇచ్చారని అంటున్నారు. ఇదే గనుక నిజమైతే మలయాళంలోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతాయి. కన్నడ, తమిళం, హిందీ టీజర్లకు కూడా టాప్ స్టార్లు వాయిస్ ఓవర్ ఇచ్చారని టాక్. ‘సైరా’ హిందీ హక్కులను బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. హిందీలో కూడా ‘సైరా’ను భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. తమిళం, మలయాళంలో కూడా భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నయనతార, అమితాబ్‌ బచ్చన్‌, తమన్నా, కిచ్చ సుధీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, రవి కిషన్‌లు కీలక పాత్రల్లో నటించారు.


By August 18, 2019 at 04:45PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mohanlal-gives-voice-over-for-sye-raa-malayalam-teaser/articleshow/70724279.cms

No comments