Breaking News

ఉనికి కోసం కాంగ్రెస్ పోరాటం.. పాదయాత్రలతో జనంలోకి హస్తం నేతలు!


తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఒకింత ఫర్వాలేదనిపించినా.. వలసల కారణంగా హస్తానికి గట్టి దెబ్బే తగిలింది. ఎమ్మెల్యేలను అధికార టీఆర్ఎస్ లాగేసుకోగా.. మిగతా నేతలను బీజేపీ తనవైపు తిప్పుకొంటోంది. అటు గులాబీ, ఇటు కమలం.. మధ్యలో హస్తం పరిస్థితి దారుణంగా మారింది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కాషాయ పార్టీ అధికారంలోకి రావడం సంగతి పక్కనబెడితే.. కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఉనికిని చాటుకోవడం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే కాంగ్రెస్ కీలక నేతలు పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతలు పాదయాత్రల ద్వారా జనాల్లోకి వెళ్తున్నారు. నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాలకు తాగు, సాగు నీరందించే ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం కోసం భువనగిరి ఎంపీ పాదయాత్ర చేపట్టబోతున్నారు. ‘రైతుసాధన యాత్ర’ పేరిట ఆగష్టు 26 నుంచి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు స్థలం నుంచి హైదరాబాద్‌లోని జలసౌధ వరకు 100 కి.మీ. ఆయన పాదయాత్ర చేపట్టబోతున్నారు. సోమవారం నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఈ పాదయాత్రలో ఎంపీతోపాటు 5 వేల మంది రైతులు కలిసి ముందుకు సాగనున్నారు. పాదయాత్రలో భాగంగా నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి పర్యటించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కూడా సోమవారం పాదయాత్ర చేపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం గురించి జనాల్లో చైతన్యం తీసుకురావడం కోసం టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ యాత్ర చేపడుతున్నారు. తమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టు నిర్మించి ఉంటే గ్రావిటీ ద్వారా గోదావరి నీరు వచ్చేదని, తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయ్యేదని కాంగ్రెస్ వాదిస్తోంది. అవినీతి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని ఆరోపిస్తోంది. ఈ విషయమై జనాల్లో అవగాహన పెంచడం కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్‌ నేతలతో కలిసి ఈ యాత్ర చేపడుతున్నారు. అదే సమయంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతలు సాగునీటి కోసం ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపడుతున్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు రద్దుకు నిరసనగా శంకర్‌పల్లి ధోబీపూర్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు నాలుగు రోజులపాటు 88 కి.మీ. మేర యాత్ర సాగనుంది. కోమటిరెడ్డి పాదయాత్రకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఆయన తమ్ముడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరతానని గతంలో ప్రకటించారు. దీంతో వెంకట్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఎంపీ ఖండించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని భావిస్తోన్న ఆయన.. ప్రభుత్వంపై పోరాటం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు.


By August 25, 2019 at 03:29PM


Read More https://telugu.samayam.com/telangana/news/tpcc-chief-uttam-kumar-reddy-and-mp-komatireddy-venkat-reddy-to-start-padayatra-separately/articleshow/70827430.cms

No comments