లోక్‌సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీకి ప్రాధాన్యం.. మిథున్ తర్వాతే రాహుల్ గాంధీ
పార్లమెంట్‌లో లోక్‌సభా పక్షనేత మిథున రెడ్డికి ప్రాధాన్యం లభించింది. స్పీకర్ ముందు వరుసలో ఆయనకు సీటు కేటాయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ, స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, నరేంద్ర తోమర్ తదితరులకు మొదటి వరుసలో సీట్లు కేటాయించారు. ప్యానెల్ స్పీకర్‌గా కొనసాగుతుండటంతోపాటు పార్టీల బలాబలాల పరంగా చూసినా.. బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే తర్వాతి స్థానంలో వైఎస్ఆర్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ ఉన్నాయి. దీంతో ఆయనకు ప్రాధాన్యం దక్కింది. టీఎంసీ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ పక్కనే మిథున్ రెడ్డికి సీటు లభించింది. డీఎంకే నేత టీఆర్ బాలు, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్‌కు ముందు వరుసలో సీటు లభించింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీయూ నేత రాజీవ్ రంజన్‌కు కూడా తొలి వరుసలో సీటు దక్కింది. ప్రధాని మోదీతో చర్చించాకే స్పీకర్ ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండో వరుసలో చివరి సీటు దక్కింది. కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతగా వ్యవహరించడానికి రాహుల్ నిరాకరించడంతో... బెంగాల్ నేత అధిర్ రంజన్ చౌదరికి ఆ పదవి కట్టబెట్టారు. దీంతో అధిర్ రంజన్‌తోపాటు సోనియా గాంధీకి మాత్రమే కాంగ్రెస్ నుంచి ముందు వరుస సీట్లు దక్కాయి. రాహుల్ గాంధీ రెండో వరుసకు పరిమితమయ్యారు. డిప్యూటీ స్పీకర్ వెనుకాల 466వ సీటును రాహుల్‌కు కేటాయించారు. మాజీ సీఎంలు అఖిలేశ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లాకు కూడా రెండో వరుసలో సీట్లు కేటాయించారు. ఇక టీఆర్ఎస్ నేతలకు మూడో వరుసలో సీట్లు కేటాయించారు. మూడో వరుసలో డీఎంకే ఎంపీలు కనిమొళి, రాజాలకు సీట్లు కేటాయించారు. గత లోక్ సభలో బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ ముందు వరుసలో కూర్చోగా.. ఈసారి వారి బదులు అమిత్ షా, స్మృతి ఇరానీ ముందు వరుసలో కూర్చోనున్నారు. వీరిద్దరూ తొలిసారి లోక్‌సభకు ఎన్నిక కావడం గమనార్హం.
By August 03, 2019 at 12:47PM
No comments