Breaking News

‘యురేనియం’ ధర్నా.. ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్ట్


హైదరాబాద్: తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు నిరసనగా ధర్నా చేస్తున్న వారికి సంఘీభావం తెలపడం కోసం వెళ్తున్న ఆయన్ను.. మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. హాజీపూర్ సమీపంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నపోలీసులు కోదండరామ్ ధర్నా జరుగుతున్న చోటుకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసు జులం నశించాలని జనసమితి నేతలు నినాదాలు చేశారు. యురేనియం వద్దు.. నల్లమలే ముద్దంటూ నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు వెంటనే కోదండరామ్‌ను అక్కడ నుండి తరలించారు. దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌గా ఉన్న అమ్రాబాద్‌ అభయారణ్యం జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు. ఇక్కడ యురేనియం అన్వేషణ కోసం సర్వేలకు కేంద్రం తుది అనుమతి మంజూరు చేస్తే.. పరిస్థితులు ప్రమాదకరంగా మారతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మే 22న ఢిల్లీలో జరిగిన కేంద్ర అటవీ శాఖ సలహా మండలి భేటీలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లోని 83 చ.కిమీ. పరిధిలో అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ (ఏఎండీ) సర్వే చేపట్టేందుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. కాగా అన్వేషణపై ఏఎండి నుంచి అందిన ప్రతిపాదనల్లో స్పష్టత లేదనే అభిప్రాయం కేంద్ర అటవీ సలహా మండలి భావించింది. దీంతో ప్రస్తుతానికి సర్వేకు మాత్రమే అనుమతిచ్చింది. కాగా సర్వేల కోసం డ్రిల్లింగ్‌ చేస్తే జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లితుందని, చెంచుల మనుగడకు ఇబ్బంది తలెత్తుందని విపక్షాలు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అడవిని వదిలి వెళ్లడానికి ఆదివాసీలు సిద్ధంగా లేరు.


By August 03, 2019 at 01:59PM


Read More https://telugu.samayam.com/telangana/news/telangana-jana-samithi-leader-prof-kodandaram-detained-by-police/articleshow/70510180.cms

No comments