Breaking News

మోదీ ప్రధాన కార్యదర్శి పదవికి మిశ్రా రాజీనామా.. ఆయన కోసం చట్టానికి సవరణలు..


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పదవి నుంచి వైదొలిగారు. 1977 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన మిశ్రా.. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పీఎంవో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మోదీ ఆయన్ను ఏరికోరి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. మిశ్రా రాజీనామాతో ఆయనకు మరో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మిశ్రాను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే.. మిశ్రా లాంటి సమర్థవంతుడైన వ్యక్తికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించాలని మోదీ యోచిస్తున్నట్టు సమాచారం. 2014లో తాను ఢిల్లీకి వచ్చినప్పుడు మిశ్రా ద్వారా ఎన్నో అంశాలను నేర్చుకున్నానని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మిశ్రా అద్భుతమైన అధికారంటూ మోదీ ప్రశంసలు గుప్పించారు. దేశ ప్రగతికి ఆయనెంతో కృషి చేశారని కొనియాడారు. ప్రధాని కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించడానికి ముందు మిశ్రా.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్‌గా పని చేశారు. నిబంధనల ప్రకారం ట్రాయ్ చైర్మన్‌గా పని చేసిన వారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ పదవినీ నిర్వహించొద్దు. కానీ మిశ్రాను మోదీ ప్రధాన కార్యదర్శిగా నియమించుకోవడం కోసం ట్రాయ్ యాక్ట్, 1997కు తాత్కాలిక ఆర్డినెన్స్ ద్వారా సవరణలు తీసుకొచ్చారు. దీన్ని బట్టే మిశ్రా అంటే మోదీకి ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. జమ్మూ కశ్మీర్ బాధ్యతలు అప్పగించడం కుదరకపోతే.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మిశ్రాకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కూడా వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.


By August 31, 2019 at 12:32PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-personal-secretary-nripendra-misra-resigns-he-may-be-made-lg-of-jammu-and-kashmir/articleshow/70921120.cms

No comments