Breaking News

మృత్యువుతో పోరాడి ఓడిన అరుణ్ జైట్లీ.. ఎయిమ్స్‌లో కన్నుమూత..


కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనారోగ్యం కారణంగా శనివారం ఢిల్లీ ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆగష్టు 9న ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఎయిమ్స్‌లో చేర్పించారు. 15 రోజులపాటు చికిత్స పొందిన ఆయన.. ఆరోగ్యం విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. జైట్లీ ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు శతథా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. జైట్లీ ఎయిమ్స్‌లో చేరిన రోజే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్షవర్దన్‌, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తదితరులు ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. 66 ఏళ్ల జైట్లీ గత ఏడాది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఈ ఏడాది జనవరిలో రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్లారు. దీంతో బడ్జెట్‌ను పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు. వృత్తిరీత్యా లాయర్ అయిన జైట్లీ ప్రధాని తొలి కేబినెట్లో కీలక మంత్రిగా, ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించారు. ఆయనకు క్యాన్సర్ రావడంతోనే చికిత్స కోసం జనవరిలో అమెరికా వెళ్లారని ప్రచారం జరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో జైట్లీ పోటీ చేయలేదు. అనారోగ్యం కారణంగా బాధ్యతలు తీసుకోవడానికి తాను సిద్ధంగా లేనని ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.


By August 24, 2019 at 12:43PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/former-union-minister-and-senior-bjp-leader-arun-jaitley-passes-away-at-aiims/articleshow/70815558.cms

No comments