Breaking News

విశాఖ చోరీ కేసులో షాకింగ్ ట్విస్ట్.... బాధితుడే నిందితుడు


విశాఖలోని పోర్టు రోడ్డులో బుధవారం జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. తనను దొంగలు కొట్టి రూ.20లక్షల నగదు దోచుకెళ్లారంటూ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన బాధితుడే అసలు నిందితుడని తెలిసి అంతా అవాక్కయ్యారు. పనిచేస్తున్న సంస్థకే కన్నం వేయాలని చూసిన శ్రీనివాసరావును అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. విశాఖలోని ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పనిచేస్తున్న శ్రీనివాసరావు తాను బుధవారం రూ.20లక్షల నగదుతో బైక్‌ వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు దాడి చేసి నగదు ఎత్తుకెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నగరంలో సంచలనం రేపడంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటనపై శ్రీనివాసరావును గుచ్చిగుచ్చి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా తానే నేరం చేసినట్లు అంగీకరించారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు శరీరంపై గాయాలు చేసుకుని, కట్టుకథ అల్లినట్లు చెప్పాడు. దీంతో అతడి నుంచి రూ.20లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో పోలీసులకు అనేక సందేహాలు వస్తున్నాయి. శ్రీనివాసరావు ఒక్కడే ఈ నేరానికి పాల్పడ్డాడా? లేక ఎవరైనా వెనకుండి చేయించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావు ప్రవర్తనపై ట్రాన్స్‌పోర్టు సంస్థ యజమానిని రప్పించి ఆరా తీశారు. అతడికి గతంలో నేర చరిత్ర ఏమైనా ఉందా?, చోరీకి ముందు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడు అన్న కోణంలో విచారిస్తున్నారు. ఈ ఘటనపై బుధవారం కేసు నమోదు చేసుకున్న విశాఖ హార్బర్ పోలీసులు ఎయిర్‌పోర్ట్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు.


By August 09, 2019 at 02:20PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/shocking-twist-in-vizag-rs-20lakh-robbery-case/articleshow/70602900.cms

No comments