Breaking News

తాజ్‌ బంజారా హోటల్‌కు రూ.12లక్షల టోకరా వేసిన కేటుగాడు


హైదరాబాద్‌‌లోని తాజ్‌బంజారా హోటల్‌లో ఏడాది పాటు రూమ్ తీసుకున్న ఓ వ్యక్తి లక్షల రూపాయలు బకాయి పెట్టి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. అతడు ఎన్ని రోజులకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ సిబ్బంది ఆరా తీయగా మోసం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలోని కిర్లంపూడి లే అవుట్‌ సమీపంలోని సాగర్‌ దీప అపార్ట్‌మెంట్స్‌లో నివసించే అక్కిచెట్టి శంకర్‌ నారాయణ్‌ నాలుగు నెలల క్రితం బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ బంజారా హోటల్‌కు వచ్చాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం తాను చాలా రోజులు నగరంలో ఉంటానని చెప్పడంతో హోటల్ సిబ్బంది ఓ రూమ్ కేటాయించారు. మొత్తం 102 రోజులు హోటల్‌లో గడిపిన శంకర్‌ నారాయణ్‌ ఏప్రిల్‌ 15న హోటల్ సిబ్బంది ఎవరికీ చెప్పకుండా తాళం వేసుకుని వెళ్లిపోయాడు. అతడు ఉన్నన్ని రోజులకు హోటల్‌ బిల్ రూ.25,96,693కాగా.. మధ్యలో రూ.13,62,149 చెల్లించాడు. ఇంకా రూ.12లక్షలు చెల్లించాల్సి ఉండగా కనిపించకుండా పోయాడు. హోటల్ నిర్వాహకులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాయమాటలతో మభ్యపెట్టాడు. జూన్ 26వ తేదీ నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అతడి కోసం గాలించారు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో హోటల్ జనరల్ మేనేజర్ హితేంద్ర శర్మ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు రూమ్ తీసుకున్న సమయంలో సమర్పించిన ఆధారాలను పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసులు శంకర్ నారాయణ‌పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


By August 09, 2019 at 01:28PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vizag-business-man-cheats-taj-banjara-hotel-case-filed/articleshow/70602162.cms

No comments