మా గగనతలం తెరిచే ఉంది, అవన్నీ పుకార్లే: పాక్
ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో భారత విమానాలకు గగనతలాన్ని పాక్ మూసివేసిందంటూ వస్తున్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది. భారత విమానాలకు తాము గగన తలాన్ని మూసివేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆ దేశ విమానాలను దారి మళ్లించలేదని స్పష్టం చేసింది. దీనిపై పాక్ పౌరవిమానయాన శాఖ అధికార ప్రతినిధి ముజ్తబా భేగ్ గురువారం ప్రకటన చేశారు. 370 ఆర్టికల్ రద్దుతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ విమానాల మార్గంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని పాక్ స్పష్టం చేసింది. తమ గగనతలం మీదుగా ప్రయాణించే విమానాలు సమయానికే నడుస్తున్నాయని, ఏ మార్గంలో మళ్లింపు చేపట్టడం లేదని చెప్పింది. బాలాకోట్ దాడుల నేపథ్యంలో ఫిబ్రవరిలో పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26 నుంచి జులై 16 వరకు ఇది కొనసాగింది. ఇటీవల పాక్ తన గగనతలాన్ని తెరవగా ఆర్టికల్ 370 రద్దుతో మళ్లీ అలాంటి వార్తలొచ్చాయి. గగనతల మార్గం మూసివేతపై మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పాక్ అధికార ప్రతినిధి డాక్టర్ మహ్మద్ ఫైజల్ స్పష్టం చేశారు. గతంలో మాదిరిగానే భారత విమానాలను తమ గగనతలంలోకి అనుమతిస్తున్నామని తెలిపారు.
By August 09, 2019 at 08:36AM
No comments