కారు అమ్మేసి.. రిక్షాలో షూటింగ్‌కు..
చేతిలో డబ్బులేక, కడుపునిండా తినలేక అవకాశాల కోసం రాత్రింబవళ్లు ఎంతో కష్టపడిన సెలబ్రిటీల గురించి మనం వినే ఉంటాం. కానీ బుల్లితెర నటిగా రాణిస్తూ రెండు చేతులా సంపాదిస్తూ కూడా మధ్య తరగతి జీవితాన్ని గడుపుతున్నారు . హిందీలో ‘రంగ్ బదల్తీ హై ఓధానీ’, ‘చంద్రమౌర్య’ అనే సీరియల్స్‌లో నటించిన యశశ్రీ.. ఇటీవల తన ఖరీదైన కారును అమ్మేశారు. డబ్బులు అవసరమై ఆమె కారు అమ్మేయలేదండోయ్.. సాధారణ ప్రజలు గడుపుతున్న జీవితాన్నే తాను అనుభవించాలనుకున్నారు. అందుకే కారు అమ్మేసి రోజూ షూటింగ్ స్పాట్స్‌కి ఆటోలో వెళుతున్నారు. ఇంతకీ యశశ్రీకి ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే.. ఓసారి వాల్టర్ అనే తన స్నేహితుడు డెన్మార్క్ నుంచి భారత్‌కు సైకిల్‌పై వచ్చాడట. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆటో బుక్ చేసుకుని ఆగ్రా చూడటానికి వెళ్లారు. వాల్టర్ తిరిగి డెన్మార్క్ వెళ్లేటప్పుడు యశశ్రీకి ఓ ఆటో రిక్షాను కానుకగా ఇచ్చి వెళ్లారు. దాంతో తన వద్ద ఉన్న ఖరీదైన కారును అమ్మేసి రోజూా ఆమె ఎక్కడికి వెళ్లాలన్నా అందులోనే వెళుతూ ఊరంతా చుట్టేస్తున్నారు. దీని గురించి యశశ్రీ మాట్లాడుతూ.. ‘నేనో నటిని కాబట్టి ఖరీదైన కారులోనే ప్రయాణించాలని నాకు చాలా మంది సూచించారు. నేను ఆటో నడుపుకుంటూ వెళ్లేటప్పుడు జనాలు నోరెళ్లబెట్టుకుని చూస్తుంటారు. హరికొందరైతే నేను పిల్లల్ని ఎక్కించుకుని స్కూల్ వద్ద దింపడానికి వెళుతున్నానేమో అనుకుంటున్నారు’ ‘నా స్నేహితులైతే నాకు పిచ్చి పట్టిందని అంటుంటారు. ఎవరేమన్నా నేను సెల్ఫ్ మేడ్ పర్సన్‌ని. నా మనసుకు నచ్చిందే చేసుకుంటూపోతాను. ఏదేమైనా చాలా మందికి నేను ఇలా ఆటోలో ప్రయాణించడం చాలా నచ్చింది. అందుకు నన్ను మెచ్చుకుంటున్నారు కూడా’ అని చెప్పుకొచ్చారు.
By August 29, 2019 at 10:40AM
No comments