భర్తపై కక్ష.. కూతుర్ని పావుగా వాడుకోవాలని చూస్తే సీన్ రివర్స్ అయ్యింది!
భర్తపై కక్ష పెంచుకున్న ఓ మహిళ అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఇందుకు తన కుమార్తెను పావుగా చేసుకుని, తప్పుడు ఆరోపణలు చేస్తూ పోక్సో చట్టం కింద కేసు బనాయించింది. అయితే, చివరకు కథ అడ్డం తిరగడంతో అదే కేసు ఆమె మెడకు చుట్టుకుంది. తప్పుడు ఆరోపణలతో చట్టాన్ని దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించిన ఆమెకు న్యాయమూర్తి తగిన శాస్తి చేశారు. ఈ కేసు ఆమెపైనే నమోదుచేయాలని సంచలన ఆదేశాలు జారీచేసి, చట్టాన్ని దుర్వినియోగం చేసేవారికి ఓ హెచ్చరికలు కావాలని వ్యాఖ్యానించారు. భర్త నుంచి విడిపోయిన చెన్నైకు చెందిన ఓ మహిళ ఆయనపై కక్ష పెంచుకుంది. అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి, తన కుమార్తె (11)పై కన్న తండ్రే అత్యాచారానికి ఒడిగట్టాడని, దీంతో ఆమె గర్భం దాల్చిందంటూ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఇటీవల ఫిర్యాదు చేసింది. అంతేకాదు, నాటు మందులు వాడి అబార్షన్ చేయించానని తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆమె భర్తపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు పేర్కొంటూ అతడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌పై జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేశ్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఇక్కడే కేసు కీలక మలుపు తిరిగింది. తండ్రికి వ్యతిరేకంగా అమ్మే అలా చెప్పమందిని బాలిక వెల్లడించడంతో కేసు అడ్డం తిరిగింది. ఎగ్మూర్ కుటుంబ న్యాయస్థానంలో ఈ విషయాన్ని బాలిక వెల్లడించినట్టు స్వయంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. భర్తపై కక్ష సాధింపు కోసమే తప్పుడు ఫిర్యాదు చేసిందని, తండ్రే కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఈ వ్యాజ్యం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆ బాలికను తాను పిలిపించి విచారించగా... ఫ్యామిలీ కోర్టులో చెప్పిన విషయాన్నే తనకూ తెలిపిందని, అది తన మనసును కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భర్తపై కక్ష సాధించడం కోసం కన్న కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దారుణమైన ఆరోపణ చేయడానికి ఓ తల్లికి ఎలా మనసు వచ్చిందో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్‌పై పోక్సో కేసును తక్షణం రద్దు చేసి, ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసిన సదరు మహిళపై అదే చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఇది పోక్సో చట్టాలను దుర్వినియోగం చేసేవారికి ఓ గుణపాఠం కావాలని న్యాయమూర్తి అన్నారు.
By August 22, 2019 at 01:07PM
No comments