Breaking News

ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. త్వరలో సీడీఎస్‌ నియామకం


73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా.. ఎర్రకోటలో ప్రధాని మోదీ రక్షణశాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో త్రివిధ దళాల సమన్వయం కోసం ఒక చీఫ్‌ (సీడీఎస్‌)ను నియమించబోతున్నట్లు ప్రకటించారు. సైనిక విభాగాల మధ్య సమన్వయానం కోసం.. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌)గా వ్యవహరిస్తారన్నారు. ఇదో గొప్ప నిర్ణయమని.. రాబోయే రోజుల్లో మన త్రివిధ దళాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయన్నారు. దేశ రక్షణ సాంకేతికతలో ఎన్నో మార్పులు వచ్చాయని.. కాబట్టి ఏదో ఒక సైనిక విభాగంపై ఆధారపడడం సరికాదని.. త్రివిధ దళాలను సమన్వయ పరుచుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పోస్ట్ గురించి గతంలో కూడా ప్రస్తావన వచ్చింది. 1999లో కార్గిల్‌ యుద్ధం తర్వాత ఏర్పాటైన కె.సుబ్రహ్మణ్యం కమిటీ తొలిసారి సీడీఎస్‌ నియామకాన్ని సిఫార్సు చేసింది. 2012లో ఏర్పాటైన నరేశ్‌ చంద్ర కమిటీ కూడా ఇదే నిర్ణయాన్ని తెలిపింది. 2016లో డీబీ షెట్కర్ కమిటీ కూడా సీడీఎస్ నియామక అవసరాన్ని తెలియజేసింది. కానీ తర్వాత దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీ సీడీఎస్ నియామకంపై ప్రకటన చేశారు. సీడీఎస్‌ను నియమించడం అత్యవసరంగా భావించింది మోదీ సర్కార్. త్రివిధ దళాలకు సంబంధించిన ప్రణాళికలు, శిక్షణ, బడ్జెటింగ్ ఇలా అన్ని వేరు, వేరుగా ఉంటున్నాయి. ఇకపై సీడీఎస్ ఈ వ్యవహారాలతో పాటూ.. త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతారు. ఇటు త్రివిధ దళాల అధిపతులు తమ విధులపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టనున్నారు. ఈ సీడీఎస్‌ను త్రివిధ దళాల్లోని ఏదో ఒక విభాగం నుంచి ఎన్నుకునే అవకాశం ఉంది. మూడు దళాల్లోని సీనియర్‌ అధికారిని సీడీఎస్‌గా నియమించే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.


By August 15, 2019 at 12:06PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-announces-new-post-of-chief-of-defence-staff/articleshow/70687350.cms

No comments