ఆర్టికల్ 370కి రాజ్యాంగ సవరణతో పనిలేకుండా దానిలో ఆయుధమే ఉపయోగపడింది!
జమ్మూకశ్మీర్‌లో అన్ని సమస్యలకూ మూల కారణమైన , 35-ఎలకు కేంద్రం ముగింపు పలికింది. బీజేపీ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఇచ్చిన హామీని మోదీ నిలబెట్టుకున్నారు. ఈ అధికరణం మూలంగా జమ్మూ కశ్మీర్‌లో రక్తపాతం జరిగి, 1959 నుంచి ఇప్పటివరకూ 41,839 మంది ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఎకరా భూమి సగటు ధర రూ.3,000 ఉండేది. ప్రస్తుతం అది చాలాచోట్ల రూ.10 లక్షల నుంచి రూ.3కోట్లకు చేరింది. కానీ, జమ్మూకశ్మీర్‌లో మాత్రం రూ.3వేల నుంచి రూ.30వేలు దాటడంలేదంటే కారణం 370 అధికరణ కారణమని రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారంటే అక్కడ ప్రజానీకం ఎంత దురావస్థలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. భూతల స్వర్గంగా చెప్పుకునే సుందర కశ్మీరంలో పర్యాటకం అభివృద్ధి చెందలేదు. ఆర్టికల్ 370 క్రమంగా కాలగర్భంలో కలిసిపోతుందని నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వెల్లడించారు కానీ, 70 ఏళ్లు దాటినా ఇంకా కొనసాగుతోంది. ఈ ఆర్టికల్ తాత్కాలికమేనని అందరూ అంగీకరిస్తున్నారు. అయితే, ఈ ఆర్టికల్ రద్దు చేయడం అంత సులభం, ఆషామాషీ కాదు. ఆర్టికల్ 368 ప్రకారం దీనికి రాజ్యాంగసవరణ తప్పనిసరి. ఇదే అంశంపై సుప్రీంకోర్టు దాఖలైన అనేక వ్యాజ్యాలు దీనికి ప్రతిబంధకంగా మారాయి. అయితే, ఆర్టికల్ 370ను రద్దుచేయడానికి వెదకబోయిన తీగ కాలికే తగిలినట్టు అందులోనే దొరికింది. రాజ్యాంగం శోధించాల్సిన పనిలేకుండా ఆర్టికల్ 370 సెక్షన్ 3లోని ఓ నిబంధనే మోదీ నెత్తిన పాలుపోసింది. ఇది కేంద్రానికి వరంగా మారి, రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా చేసింది. కాబట్టే ఆర్టికల్ 370 రద్దు చేయడంలేదని రాజ్యసభలో అమిత్ షా వెల్లడించారు. ఆర్టికల్ 370 సెక్షన్ 3 ప్రకారం... ఇందులో మిగతా అంశాలు మాటెలా ఉన్నా ఒక బహిరంగ నోటిఫికేషన్ ద్వారా దీని అమలును రాష్ట్రపతి నిలిపేయవచ్చు. జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కలిగించే ఈ ఆర్టికల్‌పై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలంటే కేంద్ర హోం, రక్షణ, సమాచార శాఖ ప్రతిపాదనలు తప్పనిసరి. అంతేకాదు, 370 రద్దు లేదా చెల్లుబాటు లేకుండా చేయడానికి పార్లమెంటు ఆమోదం కూడా అవసరం లేకుండా నాడు సెక్షన్ 3ను ఇందులో చేర్చారు. దీని వల్లే రాజ్యసభలో ప్రకటించిన క్షణాల్లోనే రాష్ట్రపతి గెజిట్ విడుదల చేశారు. ఈ గెజిట్‌తో గతంలో రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను అధిగమించారు. అయితే, ఈ ఉత్తర్వులు జారీకి రాష్ట్ర అసెంబ్లీ అమోదం అవసరం. కానీ, ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ రద్దుకాగా, రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. దీనికి గవర్నర్ ఆమోదం లభించినట్టు అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు.
By August 06, 2019 at 08:53AM
No comments