Breaking News

టీసీ కావాలంటే రూ. 2000 ఇవ్వాల్సిందే!


తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల లంచాల పర్వం కొనసాగుతూనే ఉంది. రెవెన్యూ డిపార్ట్‌మెంటలో ఇటీవల లంచాల ఘటనలు చాలా తెరపైకి వచ్చాయి. వీఆర్వోలు, ఎమ్మార్వోలు ఏసీబీ చిక్కి, సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు. అయితే ఈ లంచాల రోగం ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా అంటుకుంది. పాఠశాలలో విద్యా బుద్ధులు నేర్పి, బాలబాలికలను క్రమశిక్షణ గల భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ప్రధానోపాధ్యాయురాలి నిర్వాకం టీచర్ వృత్తికే కళంకం తెచ్చింది. జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు దండుగుల లలిత.. ఒక విద్యార్థి నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటూ గురువారం (ఆగస్టు 1) ఏసీబీకి చిక్కింది. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాఠశాలలో సుద్దాల రఘు అనే విద్యార్థి గత విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేశాడు. ఇంటర్‌లో చేరడానికి టీసీ ఇవ్వాలని ప్రధానోపాధ్యాయురాలు లలితను విజ్ఞప్తి చేశాడు. అయితే టీసీ ఇవ్వాలంటే రూ. 2000 చెల్లించాలని లలిత డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని రఘు తన తల్లిదండ్రులతో చెప్పాడు. కూలీ పనులు చేసుకునే రఘు కుటుంబం ఆ డబ్బు చెల్లించలేక, కొంతమంది సలహా మేరకు ఏసీబీని ఆశ్రయించింది. విషయాన్ని నిర్ధారణ చేసుకున్న ఏసీబీ అధికారులు గురువారం విద్యార్థి రఘు.. లలితకు డబ్బు చెల్లించి, టీసీ తీసుకున్న వెంటనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పరీక్షల ముందు కూడా హజరు శాతం తక్కువ ఉందనే సాకుతో రూ. 1500 లంచం తీసుకుని హాల్‌టికెట్ ఇచ్చిందని రఘు ఆరోపించాడు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. శుక్రవారం లలితను కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ భద్రయ్య తెలిపారు.


By August 02, 2019 at 11:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/acb-arrests-government-teacher-for-asking-bribe-to-give-tc-in-peddapalli/articleshow/70493073.cms

No comments