Breaking News

Mandapeta Kidnap: 17 బృందాలతో పోలీసుల గాలింపు.. భయపడి జషిత్‌ను వదిలేసిన కిడ్నాపర్లు


ఏదైనా ఘటన జరిగినప్పుడు పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో మండపేటలో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ కేసు నిరూపిస్తోంది. కొన్ని కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొనే పోలీసులు.. జషిత్ కిడ్నాప్ వ్యవహారంలో స్పందించిన తీరుతో హీరోలు అయిపోయారు. బాలుడిని స్వయంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీంను స్థానికులు పైకెత్తుకుని ఊరేగించారంటే పోలీసులకు అంతకుమించిన గౌరవం ఏముంటుంది. పోలీసుల గాలింపుకు తోడు మీడియాలో వచ్చిన కథనాలు, సోషల్‌మీడియాలో వైరల్ అయిన బాలుడి ఫోటోలతో భయపడిన కిడ్నాపర్లు బాలుడిని క్షేమంగా వదిలిపెట్టారు. పక్కిండి బాలుడితో ఆడుకోవడానికి వెళ్లి నాయనమ్మతో కలిసి వస్తున్న జషిత్‌ను సోమవారం రాత్రి 7.00 గంటల సమయంలో దుండగులు కిడ్నాప్ చేశారు. అపార్ట్‌మెంట్ మెట్ల వద్దకు వచ్చే సమయానికి కరెంట్ పోవడంతో నాయనమ్మ చేతిలో ఉన్న బాలుడిని దుండగులు లాక్కుని బైక్‌పై పరారయ్యారు. బాలుడి కిడ్నాప్ సమాచారం తెలియగానే రామచంద్రాపురం డీఎస్పీ సంతోష్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. బాలుడు అపహరణకు గురైన శ్రీసాయిధరణి ప్లాజా, పక్కనే ఉన్న బైపాస్‌ టోల్‌ప్లాజా వద్ద ఉన్న 11 సీసీ టీవీ ఫుటేజీలను సేకరించి విశ్లేషించారు. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కిడ్నాపర్ల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. తూర్పుగోదావరి జిల్లాతో పాటు బాలుడి స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లాలోనూ గాలించేందుకు ఆరుగురు డీఎస్పీలు, 10మంది సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, ఇతర సిబ్బందితో ఏకంగా 17 బృందాలు ఏర్పాటుచేశారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీల సాయం కూడా తీసుకున్నారు. ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాలని ఆదేశిస్తూ సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించారు. బాలుడికి సంబంధించి మీడియాలో విస్తృత కథనాలు రావడం, జషిత్ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో కిడ్నాపర్లకు వణుకు మొదలైంది. బాలుడు తమవద్దే ఉంటే ఎవరైనా గుర్తుపట్టే అవకాశముందని, దీంతో దొరికిపోతామన్న భయంతో కిడ్నాపర్లు బాలుడిని గురువారం తెల్లవారుజామున అనపర్తి సమీపంలోని కుతుకులూరు పోచమ్మ ఆలయం వద్ద విడిచిపెట్టారు. కిడ్నాపర్లు బాలుడికి ఎలాంటి హాని తలపెట్టకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనపర్తి నుంచి ఎస్పీ నయీం స్వయంగా బాలుడిని వాహనంలో తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన సమయంలో అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఎస్పీని అభినందనలతో ముంచెత్తారు.


By July 25, 2019 at 11:00AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/jashith-kidnap-case-mandapeta-people-appriciate-to-police/articleshow/70373870.cms

No comments