‘అసెంబ్లీలా కాదు లోటస్ పాండ్‌లా ఉంది.. ప్రజాస్వామ్యం మచ్చుకైనా లేదు’
ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించడంపై ఆ పార్టీ నిరసన రెండో రోజూ కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం అసెంబ్లీ గేటు ఎదుట ఆందోళన చేపట్టిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ‘స్పీకర్‌ను నియంత్రిస్తున్న ముఖ్యమంతి’ ‘తెలుగుదేశం శ్రేణులపై దాడులను అరికట్టాలి’ ‘సభను నడిపించేదిస్పీకరా? లేదా ముఖ్యమంత్రా?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలియజేశారు. ‘స్పీకర్ ఏకపక్ష వైఖరి వీడాలి’ అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ ఆవరణ నుంచి శాసనసభ వరకు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టిన టీడీపీ సభ్యులు, కాలినడకన శాసనసభకు వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ర్యాలీ చేపట్టామని వ్యాఖ్యానించారు. సభలో పాలకపక్షం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, తనను తిట్టించడానికే అధికార పార్టీ సభ్యులకు మైక్ ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఏసీ సమావేశంలో చెప్పింది ఒకటి, అసెంబ్లీలో జరుగుతున్నది మరొకటని బాబు ధ్వజమెత్తారు. జగన్ కనుసన్నల మేరకే స్పీకర్ సభను నడిపిస్తున్నారు తప్ప, సభ్యుల హక్కులను కాపాడడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని, పోరాటాలు ఇంకా ముమ్మరం చేస్తామని, ఇది ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. టీడీఎల్పీ ఉపనేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... శాసనసభ ఓ లోటస్‌పాండ్‌లా తయారైందని విమర్శించారు. అక్కడ ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తుంటే స్పీకర్ పాటిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కిందిస్థాయి ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తెస్తుంటే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. తమ సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని, తాము వాకౌట్ చేస్తామంటే సీఎం ఆదేశాల ప్రకారం సస్పెండ్ చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడుకి మైక్ ఇవ్వని సభను ఇంత వరకు చూడలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
By July 25, 2019 at 11:15AM
No comments