Breaking News

రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు.. బీజీపీలో కలవరం


మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్రసాద్.. మంగళవారం (జులై 30) ట్రిపుల్ త‌లాక్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది చ‌రిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు. త‌లాక్ ప‌ద్ధతిని ఇస్లామిక్ దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని.. పలు దేశాలు ఇప్పటికే దీనిపై నిషేధం విధించాయని తెలిపారు. లౌకిక‌ దేశ‌మైన భార‌త్‌లో మాత్రం ట్రిపుల్ త‌లాక్‌ను ర‌ద్దు చేయ‌లేక‌పోయామ‌ని ఆయన అన్నారు. ట్రిపుల్ త‌లాక్‌ బిల్లును రాజ‌కీయంగా చూడొద్దని మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు. ఇది మాన‌వ‌త్వానికి, మ‌హిళల‌ హ‌క్కులకు, లింగ స‌మాన‌త్వానికి సంబంధించిన అంశ‌మ‌ని పేర్కొన్నారు. ట్రిపుల్ త‌లాక్ చెప్పి భార్యలను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్న వారిపై క్రిమిన‌ల్ చ‌ర్యలు తీసుకోవడానికి ఈ చట్టం వీలు క‌ల్పిస్తుందని మంత్రి చెప్పారు. మ‌హిళా బాధితురాలు మాత్రమే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌వ‌చ్చు అని వివరించారు. బిల్లు ఆమోదం పొందుతుందా? ఇటీవ‌లే లోక్‌స‌భ‌లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాజ్యసభలోనూ ఈ బిల్లు ఆమోదం పొందితే చట్టరూపం దాలుస్తుంది. అయితే.. ఈ బిల్లును కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యసభలో ఎన్డీఏకు తగిన మెజార్టీ లేకపోవడంతో బిల్లు ఆమోదం పొందుతుందా? లేదా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. రాజ్యసభలో మొత్తం సభ్యులు 245 మంది కాగా.. మంగళవారం సభకు 241 మంది హాజరయ్యారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందాలంటే 121 మంది సభ్యుల ఆమోదం కావాలి. ఎన్డీఏకు 113 మంది, యూపీఏకు 68 మంది సభ్యుల బలం ఉంది. ఇతరులు 42 మంది ఉండగా.. 18 మంది సభ్యులు తటస్థంగా ఉన్నారు. హ్యాండ్ ఇచ్చిన నితీశ్.. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ పార్టీ ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా కొనసాగుతున్న జేడీయూ.. మోదీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఇదే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ ఈ బిల్లుకు మద్దతు పలికే అవకాశం ఉంది. బీజేడీ (ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీ), వైఎస్సార్‌సీపీ పార్టీలు మద్దతిస్తే ఎన్డీయే బలం 116కు పెరుగుతోంది. ఇరత పార్టీల ఎంపీలు, స్వతంత్రులు మద్దతిచ్చిన పక్షంలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందుతుంది.


By July 30, 2019 at 01:32PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/minister-ravi-shankar-prasad-tables-triple-talaq-bill-in-rajya-sabha/articleshow/70447444.cms

No comments