Breaking News

వాన్‌పిక్ కేసు.. సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ ప్రసాద్?


ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్టు సమాచారం. రస్ అల్ ఖైమా ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో బెల్‌గ్రేడ్‌‌లో నిమ్మగడ్డను అదుపుతోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని భోగట్టా. వాన్‌పిక్ వాటాల విషయంలో రస్ అల్ ఖైమా, నిమ్మగడ్డకు విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. విహారయాత్రకు సెర్బియా వెళ్లిన నిమ్మగడ్డను అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. రెండు రోజుల కిందటే ఈ ఘటన జరిగిందని, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్‌ విషయం విదేశాంగ మంత్రి జయశంకర్‌ దృష్టికి వైసీపీ నేతలు తీసుకెళ్లారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఆయనను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని వారు కోరినట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వాడ్రేవ్ అండ్‌ నిజాంపట్నం ఇండస్ట్రియల్‌ కారిడార్‌’... దీనినే సంక్షిప్తంగా ‘వాన్‌పిక్‌’ అని పిలుస్తారు. తీర ప్రాంత అభివృద్ధి పేరిట దివంగత సీఎం వైఎస్ హయాంలో 2005-2006లో వాన్‌పిక్‌ కోసం భూ సేకరణ చేపట్టారు. ఇందుకు గుంటూరు, ప్రకాశం జిల్లాలో దాదాపు 29 వేల ఎకరాల భూమిని సేకరించారు. ఎకరానికి గరిష్ఠంగా రూ.90 వేల నుంచి లక్షన్నర మాత్రమే ఇచ్చారని, ప్రజల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా బెదిరించి మరీ భూములు లాక్కున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ‘వాన్‌పిక్‌’ ప్రాజెక్టు ముందస్తు అంచనాలతో చాలా మంది నేతలు ఇక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వాటిలో చాలావరకు అసైన్డ్‌ భూములు కూడా ఉన్నాయి. సేకరించిన భూములను నాటి ప్రభుత్వం కొంతమంది పారిశ్రామికవేత్తలకు కేటాయించింది. వాన్‌పిక్‌కు గుంటూరు జిల్లా నిజాంపట్నం రైతులు 4 వేల ఎకరాలు, దిండి రెవెన్యూ గ్రామ పరిధిలో రైతులు 5 వేల ఎకరాలు, అడవుల దీవి గ్రామ పరిధిలో 1400 ఎకరాలు, అడవిపాలెం గ్రామ పరిధిలో రైతులు 286 ఎకరాలు, కళ్లిపాలెం రైతులు 607 ఎకరాల భూములు ఇచ్చారు. అన్ని వేల ఎకరాల భూమి సేకరించినా వాన్‌పిక్‌ ప్రాజెక్టు అంగుళం కూడా కదల్లేదు. ఈ అంశంలో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని పేర్కొంటూ సీబీఐ కేసు నమోదుచేసింది. ఈ కేసులో జగన్‌తోపాటు మంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయి 16 నెలలపాటు జైలులో గడిపారు. రెండేళ్ల కిందట వాన్‌పిక్‌కు చెందిన 11,804 ఎకరాల భూమిని ఈడీ స్వాధీనం చేసుకుంది.


By July 30, 2019 at 01:33PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/serbia-police-arrests-nimmagadda-prasad-in-vanpic-case/articleshow/70447453.cms

No comments