Breaking News

‘జగన్ మీకు చేతకాకపోతే చెప్పండి.. నేను చేసి చూపిస్తా’


విజయవాడలోని బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణ విషయంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వ్యక్తంచేసిన సందేహాలపై అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. తొలి దశ పైవంతనకు అప్రోచ్‌ రహదారి నిర్మాణం కోసం భూమి సేకరించాల్సి ఉంది. ఇందుకు మొత్తం రూ.12.50 కోట్లు అవసరమవుతుంది. అయితే, కేవలం 150 మీటర్ల దూరానికి అంత మొత్తం అవసరమా అంటూ ఎన్‌హెచ్ఏఐ నోరెళ్లబెట్టింది. అంతేకాదు, అసలు డిజైన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? వాటికి అనుమతి ఎవరు ఇచ్చారు? ప్రస్తుతం అదనపు వ్యయం ఎలా భరిస్తాం? అయినా మనకు సంబంధం లేదని కొర్రీలు వేసింది. కేవలం 150 మీటర్ల దూరానికి రూ.12.50 కోట్ల పరిహారమా..? ఈ మేర ధరలు ఉన్నాయా? అంత సొమ్ము ఏ రీతిలో చెల్లిస్తామని నిలదీసింది. దీంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ అంశంపై నేత, విజయవాడ ఎంపీ తనదైన శైలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి చురకలంటించారు. మీకు చేతకాకపోతే చెప్పండి నేను చేసి చూపిస్తానని, ఇంత చిన్న సమస్యకు పరిష్కారం చూపలేని మీరు ఈ రాష్ట్రం ఎదుర్కుంటున్న అనేక పెద్ద పెద్ద సమస్యలని ఏ రకంగా పరిష్కరిస్తారని ఎద్దేవా చేశారు. ట్విట్టర్‌లో ఈ మేరకు కేశినేని ట్వీట్ చేశారు. ‘ఇంత చిన్న సమస్యకు పరిష్కారం చూపలేని మీరు ఈ రాష్ట్రం ఎదుర్కుంటున్న అనేక పెద్ద పెద్ద సమస్యలని ఏ రకంగా పరిష్కరిస్తారు జగన్ రెడ్డి గారు. @ysjagan మీకు చేత కాక పోతే చెప్పండి నేను చేసి చూపిస్తా. మీరు @nimmagada వ్యవహారం చూసుకోవచ్చు’ అంటూ ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. కాగా, పైవంతెన రెండోదశకు మోక్షం లభిస్తుందో లేదో గానీ, తొలిదశకే కేంద్రం కొర్రీలు వేస్తోంది. దీనిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉందని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. ఏం చేయాలో అర్థంగాక గుత్తేదారు జుట్టుపీక్కుంటున్నారు. బెంజిసర్కిల్‌ పైవంతెన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎన్‌హెచ్‌ఏఐ భూసేకరణకు సిద్ధపడింది. నిర్వాసితులతో కలెక్టర్‌ ఆధ్వర్యంలో సంప్రదింపులు జరిపినప్పుడు మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని వారు కోరారు. ఈ ప్రతిపాదనలు స్థానిక అధికారులు కేంద్ర కార్యాలయానికి పంపగా, వాటిని తిరస్కరించారు.


By July 31, 2019 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-mp-kesineni-tweet-on-ys-jaganmohan-reddy-for-kanakadurga-flyover-works/articleshow/70460822.cms

No comments