చంద్రబాబు ఆప్కోను నిర్వీర్యం చేశారు: ఎమ్మెల్యే ఆర్కే
చేనేత కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన చేనేత రంగ సమస్యల కోసం పోరాడారని, దీనికోసం ఆయన దీక్ష కూడా చేశారని గుర్తుచేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేనేత రంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగం తర్వాత రెండో ప్రాధాన్యత చేనేతకే ఇస్తోందని ఆర్కే తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేత రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొందని, ఆప్కోను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేసేశారని విమర్శించారు. కేంద్రం మెగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ముందుకొస్తే, చంద్రబాబు ప్రభుత్వం వాటిని బ్లాక్ క్లస్టర్లుగా మార్చేసిందని, వాటి వల్ల చాలా తక్కువ మందికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆర్కే ప్రశ్నలకు స్పందించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.. మెగా క్లస్టర్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోఉంటాయని, వాటిని కేంద్రం రద్దుచేసి బ్లాక్ క్లస్టర్లను తీసుకొచ్చిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆప్కోలో భారీస్థాయిలో అవినీతి జరిగినట్లు గుర్తించామని, దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలను స్ఫూర్తిగా తీసుకుని ఆప్కోకు పునర్‌వైభవం తెచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
By July 22, 2019 at 12:02PM
No comments