Breaking News

ఆధార్ సవరణ బిల్లు.. లోక్‌సభలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్దం!


ఆధార్ సవరణ బిల్లును లోక్‌సభలో గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీ, టీడీపీల మధ్య లోక్‌సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఎంపీ కోటగిరి శ్రీధర్, లోక్‌సభాపక్ష నేత కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. బిలుపై వైసీపీ ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ.. దేశంలోనే అతి పెద్దదైన ఆధార్‌ సమాచారం లీక్‌ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని, గత టీడీపీ ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసాధికారిక, స్మార్ట్‌ పల్స్‌ పేరుతో సర్వే నిర్వహించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా నిర్వహిస్తామంటూ 1.26 కోట్ల కుటుంబాల సామాజిక, ఆర్థిక సమాచారం సేకరించిందన్నారు. ఆధార్‌లో అసంపూర్తిగా ఉన్న సమాచారాన్ని సంక్షేమం పేరుతో టీడీపీ ప్రభుత్వం సేకరించిందని పేర్కొన్నారు. కోటగిరి వ్యాఖ్యలపై స్పందించిన రామ్మోహన్ నాయుడు నిరాధార ఆరోపణలు సరికాదని ఖండించారు. సర్వేల పేరుతో సేకరించిన ప్రజా సమాచారం మొత్తం బహిర్గతమైందని, ఆధార్‌తో అనుసంధానించిన స్మార్ట్‌పల్స్‌ డేటా లీకయిందని తెలంగాణ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ స్పష్టం చేసిందని వైసీపీ ఎంపీ అన్నారు . ఏపీ, తెలంగాణకు చెందిన 7.8 కోట్ల మంది ప్రజల వివరాలు ప్రైవేటు సంస్థ తస్కరించిందని తెలిపారు. ఈ సమాచారం బయటపడటంపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బిల్లుపై చర్చలో పాల్గొన్న రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీ శ్రీధర్‌ వివరాలు తెలుసుకోకుండా గత టీడీపీ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న సమాచారం లీకయ్యిందని ఎలా అంటారని రామ్మోహన్ నిలదీశారు. ఈ సమయంలో వైసీపీ ఎంపీలు ప్రతి వ్యాఖ్యలు చేస్తుండగా స్పీకర్ స్థానంలో ఉన్న మీనాక్షి లేఖి వారిని వారించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, ఆధార్ సవరణ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. దేశంలో ఆధార్ కార్డు ఇక స్వచ్ఛందమే. బ్యాంక్ ఖాతాలు తెరిచేటప్పుడు, సిమ్ కొనుగోలు చేసేటప్పుడు ఆధార్ కార్డును స్వచ్ఛందంగా వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన ‘ఆధార్‌ సవరణ బిల్లు 2019’కి లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. ఇకపై గుర్తింపు కార్డు అవసరం ఉన్నచోట ఆధార్ కార్డు ఇవ్వాలా? వద్దా? అన్నది వినియోగదారుడి ఇష్టమని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.


By July 05, 2019 at 10:11AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/severe-arguments-between-tdp-and-ysrcp-mps-at-lok-sabha-in-aadhar-amendment-bill/articleshow/70083755.cms

No comments