హైకోర్టుకు చేరిన పీపీఏల అంశం.. జగన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు!
టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విండ్, సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రెండుసార్లు లేఖలు రాసింది. అలాగే ఎన్టీపీసీ, ఎస్ఈసీఐలు సైతం ధరలను సమీక్షించే ప్రశ్నేలేదని తేల్చిచెప్పాయి. తాజాగా, ఏపీ ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని రద్దుచేయాలని కోరుతూ ఒప్పందం కుదుర్చుకున్న పలు సంస్థలు హైకోర్టును ఆశ్రయించారు. తగ్గించిన ధరల ప్రకారం విద్యుత్ సరఫరా చేయాలని, లేని పక్షంలో తమ వైఖరిని కమిటీ ముందు వెల్లడించాలని పేర్కొంటూ జులై 12న రాసిన లేఖలనూ రద్దు చేయాలని పిటిషన్‌లో కోరాయి. టారిఫ్ తగ్గింపు, పీపీఏల రద్దు విషయంలో నిర్ణయం తీసుకోకుండా అధికారులను ఆదేశించాలని ఆ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. టారిఫ్ విషయంలో తాము చెప్పినట్టు చేయకపోతే 25 ఏళ్లపాటు కొనసాగేలా చేసుకున్న పీపీఏలను రద్దు చేస్తామని రాష్ట్ర ఇంధనశాఖ, ఎస్పీడీసీఎల్ అధికారులు బెదిరిస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ 63ను అనుసరించి ఏపీఈఆర్‌సీ టారిఫ్‌ను ఆమోదించినప్పటికీ.. అధికారంలేని ఇంధనశాఖ, ఎస్పీడీసీఎల్‌లు తగ్గించాలని కోరుతున్నాయని తెలిపారు. ఈపథ్యంలో ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ చర్యలను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించాలని వారు కోరారు. 2015లో చేసుకున్న ఒప్పందంలో యూనిట్ విద్యుత్తుకు ఎంత టారిఫ్ చెల్లించాలనే అంశంపై ఓ అంగీకారానికి వచ్చినట్టు వివరించారు. ఆ ధరలను ఏపీఈఆర్‌సీ ఆమోదించిందని, వివిధ విద్యుత్తు సరఫరా సంస్థలకు ఏపీఎస్పీడీసీఎల్ చెల్లించాల్సిన బకాయిలు రూ.కోట్లలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆ బకాయిలు చెల్లించరాదనే ఉద్దేశంతో వారు వివిధ ఎత్తుగడలు వేస్తోందని ఓ విద్యుత్తు సంస్థ తన పిటిషన్లో ఆరోపించింది. ఒకసారి ఒప్పందం చేసుకున్న తర్వాత ధరలను సమీక్షించే అధికారం ఏపీఈఆర్‌సీకి ఉంది కానీ, సంప్రదింపుల కమిటీకి లేదని వివరించాయి. సోలార్ విద్యుత్తు యూనిట్ టారిఫ్ ధరను రూ.2.44కు తగ్గించి బిల్లులను సమర్పించాలని కోరుతూ లేఖలు రాసిందని తెలిపాయి. అయితే, ధరలను తగ్గించాలని సంప్రదింపుల కమిటీ, ఎపీఎస్పీడీసీఎల్ కోరడానికి వీల్లేదని అన్నాయి. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఇంధనశాఖ కార్యదర్శి జులై 1న జారీచేసిన జీవో 63ను, తదనుగుణంగా జారీ అయిన ఆదేశాల్ని రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై నలభైకి పైగా సంస్థలు హైకోర్టులో సుమారు 15 వ్యాజ్యాలు దాఖలు చేయడం విశేషం. రెన్యూ పవర్ లిమిటెడ్, హెటిరో విండ్ పవర్ లిమిటెడ్, ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ లిమిటెడ్ తదితర సంస్థలు పిటిషన్ దాఖలుచేసినవారిలో ఉన్నాయి. ఈ పిటిషన్లను హైకోర్టు గురువారం విచారణకు చేపట్టే అవకాశం ఉంది.
By July 25, 2019 at 08:09AM
No comments