Breaking News

జషిత్ కిడ్నాప్.. నిందితుల లక్ష్యమేంటో?


ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మూడురోజుల తర్వాత బాలుడు క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, మీడియాతో సాయంతో తమ బిడ్డకు క్షేమంగా తిరిగొచ్చాడని బాలుడి తల్లిదండ్రులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కథ సుఖాంతం అయినప్పటికీ జషిత్‌ను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు ఎత్తుకెళ్లారు? వాళ్ల లక్ష్యమేంటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో జషిత్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు గురువారం తెల్లవారుజామున బాలుడిని అనపర్తి మండలంలోని కుతుకులూరు వద్ద వదలివెళ్లారు. బాలుడు ఎలాంటి అనారోగ్యానికి గురికాకపోవడం, ఉత్సాహంగా ఉండటంతో కిడ్నాపర్లు జషిత్‌ను బాగానే చూసుకున్నట్లు తెలుస్తోంది. తనను ఎత్తుకెళ్లి ఓ ఇంట్లో ఉంచారని, ఇడ్లీలు, పెరుగన్నం పెట్టారని జషిత్ చెబుతున్నాడు. అతడి ఒంటిపై కూడా ఎలాంటి గాయాలు లేవు. సాధారణంగా డబ్బుల కోసమో, వ్యక్తిగత కక్షతోనో పిల్లల కిడ్నాప్‌లు జరుగుతుంటాయని, అయితే జషిత్ వ్యవహారంలో ఏ కోణమూ తమకు ఇంకా దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. డబ్బుల కోసమే అయితే కిడ్నాప్ చేసిన వెంటనే తల్లిదండ్రులకో, బంధువులకో ఫోన్ చేసేవారని.. కానీ జషిత్ కిడ్నాప్ చేసినవారు ఎవరికీ కూడా ఒక్క కాల్ చేయలేదు. అంటే ఇది డబ్బలు కోసం చేసింది కాదని స్పష్టమవుతోంది. ఒకవేళ్ల వ్యక్తిగత కక్షతో కిడ్నాప్ చేసినట్లయితే బాలుడికి హాని తలపెట్టేవారు. కానీ కిడ్నాపర్లు తనను బాగా చూసుకున్నారని, వేళకు ఆహారం కూడా పెట్టారని బాలుడు చెబుతున్నారు. దీంతో ఈ కేసును ఏ కోణంలో దర్యాప్తు చేయాలో పోలీసులకు అర్థం కావడం లేదు. బాలుడి తల్లిదండ్రులను బెదిరించడానికి ఎవరైనా ఈ పని చేశారా అంటే.. తమకెవరితోనూ గొడవలు, శత్రుత్వం లేదని వారు చెబుతున్నారు. తనను కిడ్నాప్ చేసిన వారిలో రాజు అనే వ్యక్తి ఉన్నాడని, అతడు తనకె తెలుసని జషిత్ చెప్పగా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ముందుగానే అతడితో ఎవరైనా పరిచయం పెంచుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి జషిత్ కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడినా.. ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, త్వరలోనే పట్టుకుంటామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం స్పష్టం చేస్తున్నారు.


By July 25, 2019 at 11:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/east-godavari-cops-under-investigation-speedup-in-jashith-kidnapping-case/articleshow/70374516.cms

No comments