Breaking News

ఇస్రో ‘బాహుబలి’ ప్రయోగానికి సిద్ధం.. నేటి సాయంత్రం కౌంట్‌డౌన్!


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రయోగం జులై 15న సాంకేతిక లోపంతో అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రయోగాన్ని జులై 22న నిర్వహించనున్నారు. నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహక నౌకను నింగిలోకి పంపనున్నారు. ఇందుకు శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈమేరకు శనివారం నిర్వహించిన రాకెట్‌ సన్నద్ధత సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన రాకెట్ సన్నద్దత సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 ప్రయోగంపై ప్రధానంగా చర్చించారు. జీఎస్ఎల్వీ మార్క్-3 ఎం 1 రాకెట్ క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో జులై 14న ప్రయోగానికి 56 నిమిషాల ముందు వాయిదా వేశారు. ఇంజిన్ బాటిల్‌లో ఏర్పడిన లీకేజ్‌ను ఎలా అధిగమించారు, మున్ముందు ఇలాంటివి తలెత్తకుండా తీసుకున్న చర్యలేంటి, ఈ ఐదు రోజుల వ్యవధిలో చేసిన పనులపై సమావేశంలో సమీక్షించారు. అనంతరం పొద్దు పోయేవరకు లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) సమావేశం జరిగింది. వాహక నౌక ప్రయోగానికి ల్యాబ్‌ ఛైర్మన్‌ రాజరాజన్‌ ఈ సమావేశంలో అనుమతి ఇచ్చారు. ప్రయోగానికి సంబంధించిన 20 గంటల కౌంట్‌డౌన్‌ ఆదివారం సాయంత్రం ప్రారంభం కానుంది. సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమయ్యే ఈ కౌంట్‌డౌన్ 20 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగిన తర్వాత జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. చంద్రయాన్-1 తర్వాత చంద్రుడిపైకి రెండో ఉపగ్రహం పంపేందుకు ఇస్రో తీవ్ర ప్రయత్నాలు చేసింది. కొన్ని ప్రతికూల పరిస్థితులు కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేస్తూ వస్తోంది. చివరకు జులై 15న ఈ ప్రయోగం నిర్వహించాలనే కృతనిశ్చయంతో సర్వం సిద్ధం చేసింది. సాధారణంగా నిర్దిష్ట సమయంలోనే వ్యోమనౌకను ప్రయోగించాల్సి ఉంటుంది. సోమవారం తెల్లవారుజామున లాంచింగ్ విండో అనుకూలంగా ఉండటంతో ప్రయోగాన్ని పూర్తిచేసేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. జులై 15 సోమవారం నాటి లాంచ్‌ విండో నిడివి దాదాపు 10 నిమిషాలు కావడం గమనార్హం. చంద్రయాన్‌-2.. చంద్రుడు-సౌర కుటుంబం పుట్టుక రహస్యాలతోపాటు చంద్రుడిపై నీరు, ఖనిజాల విస్తృతిని శోధించేందుకు ఉద్దేశించిన ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3లో తలెత్తిన సాంకేతిక లోపంపై ఇస్రో శాస్త్రవేత్తలు వివిధ కోణాల్లో పరిశీలన జరిపారు. క్రయోజెనిక్‌ దశలో లోపం తలెత్తినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. క్రయోజనిక్ ఇంజిన్‌లోని హీలియం బాటిల్‌లో లీక్ ఏర్పడినట్టు గుర్తించారు. ఇంజిన్‌లోని ఒక సర్క్యూట్‌లో ఇంధనంగా ద్రవ ఆక్సిజన్, హైడ్రోజన్, హీలియం నింపి ఉంచినప్పుడు బాటిల్‌లో పీడనం 50 నుంచి 350 ఉంటుంది. హీలియం నింపిన తర్వాత దాని పీడనం తగ్గిపోవడం గుర్తించి, ఇది లీక్ అవుతుందనడానికి సూచన అని శాస్త్రవేత్తలు భావించారు. గ్యాస్ కంటెయినర్‌లో లీక్ ఎక్కడయిందనే అంశాన్ని తెలుసుకున్నారు.


By July 21, 2019 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/countdown-will-start-today-evening-for-chandrayaan-2-mission-launching/articleshow/70313563.cms

No comments