టీడీపీకి షాక్.. శాసనసభ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారంటూ ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడిని బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సస్పెండ్ చేశారు. ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేయాలంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. దీంతో డిప్యూటీ స్పీకర్ వారిని బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. తమను సస్పెండ్ చేయడం అన్యాయమని ముగ్గురు సభ్యులు సభలో కూర్చోగా మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తరలించారు. సస్పెండ్ అయిన ముగ్గురు సభ్యులు టీడీపీ శాసన సభాపక్ష ఉపనాయకులే కావడం గమనార్హం. మంగళవారం ప్రారంభం నుంచి సభలో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, 45 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్, పంచాయతీరాజ్ శాఖలో నిలిచిపోయిన పనులపై టీడీపీ సభ్యుల ప్రశ్నలు లేవనెత్తగా సంబంధిత మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం వైసీపీ ఇచ్చిన ఎన్నికల హామీలపై టీడీపీ నిలదీయడంతో సభలో గందరగోళం నెలకొంది.
By July 23, 2019 at 10:07AM
No comments