నాగుల పంచమి రోజున పాముకు పాలు పోశారో.. చిక్కుల్లో పడినట్లే
హిందూ మతంలో పామును కూడా దేవతగా పూజిస్తారు. ఓవైపు విష జంతువుగా దాన్ని భావిస్తూనే మరోవైపు నాగదేవతగా కొలిచి పూజలు చేయడం చూస్తూనే ఉంటాం. సాధారణ రోజుల్లో పాముల పుట్ట వైపే వెళ్లడానికి భయపడే ప్రజలు నాగపంచమి, నాగులచవితి పర్వదినాలు వచ్చాయంటే అక్కడికి పరుగులు పెడతారు. పాముకు పూజలు చేసి పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకుంటుంటారు. అయితే రోజు పాములకు పాలు పోసి ఇబ్బంది పెడితే కేసులు ఎదుర్కోవాల్సిందేనని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆగస్టు 5న నాగుల పంచమి సందర్భంగా పాముల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో అటవీశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. నాగుల పంచమి సందర్భంగా పాములకు తాగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ తెలిపారు. నాగుల పంచమి రోజున పాములను ఆడించడం, పాలు తాగించడం వంటిని జంతుహింస కిందకు వస్తాయని ప్రశాంత్‌కుమార్ తెలిపారు. పాములు పాలు తాగవని, వాటికి బలవంతంగా తాగించి ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. దేవాలయాల వద్దకు ఎవరైనా పాములతో వస్తే ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాముల సంరక్షణపై దేవాలయాలు, పాఠశాలలు, గ్రామసభల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ప్రశాంత్‌కుమార్ తెలిపారు.
By July 23, 2019 at 09:46AM
No comments