‘ఆ ఎమ్మెల్యేకు నెలకు 50 వేలు చొప్పున ఐదేళ్లు ఇచ్చా.. అయినా ద్రోహం చేశాడు’
అధిష్ఠానంపై గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న ఎమ్మెల్యే పార్టీ మారే అంశంపై స్పష్టతనిచ్చారు. బీజేపీలో చేరికపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తన వెంట వస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్నారు. భట్టి విక్రమార్కను అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. తనకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. తాను ఏం నిర్ణయం తీసుకున్నా నియోజకవర్గ ప్రజల సూచన మేరకే తప్పితే, పదవులు ఆశించి బీజేపీలో చేరడం లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అమ్ముడు పోయారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. గత ఐదేళ్లు నెలకు రూ.50వేల చొప్పున చిరుమర్తికి ఇచ్చానని, టికెట్ ఇప్పించి గెలిపిస్తే ద్రోహం చేసి వెళ్లిపోయాడని ఆరోపించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్‌ను కలిసిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ పరిధిలోని భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అలాగే ఉదయ సముద్రం ప్రాజెక్టు, మూసీ కాలువల వెడల్పునకు నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేసినట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. కాగా, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ వెంకటరెడ్డి స్పందించారు. తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు. వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. మరో జన్మంటూ ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరుకుంటానని మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. నెల రోజుల నుంచి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు అంశంపై మీడియలో చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో పార్టీ మారుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి కొనసాగింపుగా ఆయన తన సన్నిహితులతో సంప్రదింపులు జరపడంతో బీజేపీలో చేరడం ఖాయమనే విషయం అవగతమైంది. వాస్తవానికి రాజగోపాల్‌రెడ్డి, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీజేపీలో చేరుతారని గతేడాది ప్రచారం జరిగింది.
By July 20, 2019 at 11:12AM
No comments