Breaking News

రూ.15లక్షలతో విందు ఏర్పాటుచేసి కోటీశ్వరుడయ్యాడు


ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు విందు ఇచ్చిన ఓ రైతు 24గంటలు తిరిగేసరికి ఏకంగా కోటీశ్వరుడైపోయాడు. ఏంటి అతడికి లాటరీ ఏమైనా తగిలిందనుకుంటున్నారా? అదేం కాదు విందుకు వచ్చినవారు ఇచ్చిన చెల్లింపులే అతడిని కోటీశ్వరుడిని చేసేశాయి. దీంతో నిన్నటివరకు ఆర్థిక సమస్యలతో సతమతమైన ఆ రైతు ఇప్పుడు ఏకంగా కుబేరుడు అయిపోయాడు. ఈ వింత ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పుదుక్కోట జిల్లా కీరామంగళం తాలూకాలోని వడగాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే రైతు వ్యవసాయంలో నష్టపోయి ఆర్థికంగా కుదేలైపోయాడు. దీంతో కష్టాల నుంచి గట్టెక్కేందుకు బంధుమిత్రులకు విందు ఏర్పాటుచేశాడు. సుమారు 50,000 ఆహ్వాన పత్రికలను ముద్రించి బంధువులు, స్నేహితులు, స్థానికులతో పాటు ఇతర గ్రామాల్లోనూ పంచాడు. 1000 కిలోల మేక మాంసంతో రకరకాల ఆహార పదార్థాలు తయారుచేయించాడు. సుమారు 5వేల మంది అతిథులకు ఆప్యాయంగా వడ్డించాడు. కృష్ణమూర్తి ఆతిథ్యంతో ఖుషీ అయిన అతిథులు కళ్లు చెదిరే రీతిలో చదివింపులు చెల్లించారు. దీనిద్వారా వచ్చిన డబ్బులు లెక్కించేందుకు ఏకంగా బ్యాంకు సిబ్బందిని ఉపయోగించుకోవడం విశేషం. క్యాష్ కౌంటింగ్ మిషన్ల సాయంతో లెక్కించగా మొత్తం డబ్బుల విలువ రూ.4కోట్లుగా తేలింది. దీంతో కృష్ణమూర్తి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఒక్క విందుతో తన కష్టాలన్నీ తీరిపోయాయని అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబు అవుతున్నాడు. ఈ డబ్బులు లెక్కిస్తున్న సమయంలో పోలీసులు బందోబస్తు నిర్వహించడం మరో విశేషం. మొత్తానికి కృష్ణమూర్తి అదృష్టానికి అందరూ ముచ్చటపడుతున్నారు. ఏళ్లనాటి సంప్రదాయం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు విందు భోజనం ఏర్పాటు చేయడం.. బంధుమిత్రులు వచ్చి ఆ విందు ఆరగించి వారి స్థోమతను బట్టి చదివింపుల కింద ఆర్థిక సాయం అందించే సంప్రదాయం తమిళనాడు పుదుక్కోట జిల్లా కీరామంగళం తాలూకాలోని వడగాడు, పరిసర గ్రామాల్లో వందల ఏళ్లుగా కొనసాగుతోంది. ఆర్థికంగా చితికిపోయిన వారిని ఆదుకునేందుకు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయమే కృష్ణమూర్తిని కుబేరుడిని చేసింది.


By July 27, 2019 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-farmer-arranged-lunch-with-rs-15lacs-cost-and-receive-rs-4crores/articleshow/70405091.cms

No comments